CSIR NET | న్యూఢిల్లీ, జూన్ 21: నీట్, నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకల ఆరోపణలపై వివాదం కొనసాగుతుండగానే జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పరీక్ష వాయిదాకు స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. సైన్స్ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అర్హతగా ఏడాదికి రెండుసార్లు సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తారు.
కాగా, ఎన్టీఏనే నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎన్టీఏనే జరిపిన యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష జరిగిన మరునాడే రద్దు చేసింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. పరీక్ష వాయిదాపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఎన్టీఏ.. యువతకు గాయం చేసే ‘నరేంద్ర ట్రామా ఏజెన్సీ’గా మారిందని విమర్శించారు.