చదువుకొంటున్న మీ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? వారి వద్ద సెల్‌ఫోన్, లాప్టాప్ ఉన్నదా? అయితే చాలా జాగ్రత్త! మీరు ఇచ్చే పాకెట్ మనీని మీ పిల్లలు ఏ అవసరాలకు ఖర్చు పెడుతున్నారో గమనించండి. సెల్ఫోన్లో ఏమి చూస్తున్నారో, వేటిని డౌన్లోడ్ చేస్తున్నారో నిఘా వేయండి. పిల్లల నగ్న దృశ్యాలు, పోర్న్ వీడియోలతో వ్యాపారం చేసే ముఠాలు టీనేజ్ పిల్లలపై వల విసురుతున్నాయి. ఇప్పటికే కొంతమంది పిల్లలు తమ పాకెట్ మనీతో నగ్న వీడియోలు, శృంగార వీడియోలు కొనుగోలు చేస్తున్నారు. పొద్దస్తమానం వాటినే చూస్తూ.. వాటి గురించే ఆలోచిస్తూ.. బానిసలుగా మారుతూ.. చదువులు, జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. తెలంగాణ పోలీసులు ఆన్లైన్లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇలాంటి ఎన్నో భయంకర, విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పిల్లల నగ్న దృశ్యాలను, శృంగార వీడియాలను చూసి రాక్షసానందం పొందే వికారబుద్ధి కొందరిదైతే, వాటితో వ్యాపారం చేసే నీచత్వం మరికొందరిది. ఇప్పుడు ఈ నీచ వ్యాపారం పాఠశాల స్థాయికీ ఎగబాకుతున్నది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లోని స్కూల్ పిల్లలకు సైతం వల విసురుతున్నాయి.
ఏదో రకంగా సంపన్న కుటుంబాలకు చెందిన స్కూల్ పిల్లల ఫోన్ నెంబర్లను సంపాదించి, వారికి హాట్ హాట్ పోర్న్ వీడియాలను పరిచయం చేస్తున్నాయి. రూ.450కే 4,000 వీడియోలు పంపిస్తామంటూ పిల్లల బలహీనతలను రెచ్చగొడుతున్నాయి. నెలకు రూ.150 చొప్పున చెల్లిస్తే రోజుకు వంద వీడియోలు పంపిస్తామంటూ లేత మనసులపై వల విసురుతున్నాయి.
తాము పెట్టే మెసేజ్‌లకు ఆకర్షితులయ్యే పిల్లల నుంచి పేటీఎం తదితర అకౌంట్ల ద్వారా డబ్బులు తీసుకొని, వారికి అశ్లీల, నగ్న వీడియోల లింక్‌లు పంపిస్తున్నాయి. అంతేకాదు ఈ ముఠాలు కస్టమర్ల దగ్గర ఉన్న పోర్న్ వీడియోలను సైతం కొనుగోలు చేసి, వాటిని మరికొందరికి సర్క్యులేట్ చేస్తున్నాయి. చేతిలో పాకెట్ మనీ ఉండటంతో పిల్లలు తేలికగా వారి బారిన పడుతున్నారు.
పోర్న్ వీడియోల క్రయ విక్రయాలకు ప్రధానంగా టెలిగ్రామ్‌ను వాడుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ పాపిష్టి ముఠాలు ప్రధాన నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని, వారి ద్వారా టెలిగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, యువతకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డార్క్‌నెట్ సైట్లు, కొన్ని సోషల్ మీడియా యాప్‌ల వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారంపై మహిళా భద్రత విభాగం దృష్టి సారించింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా పెడదారి పట్టి, పోర్న్ వీడియోలను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.200కు 400 చైల్డ్ పోర్న్ వీడియోలు విక్రయిస్తున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోజుకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నట్టు బయటపడింది. తన వద్ద 15 వేల వీడియోలు ఉన్నాయని కస్టమర్లకు చెప్తున్నట్టు సమాచారం. ఈ దందా సంబంధం ఉన్న కీలక వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడని, అతను అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవాడని పోలీసులు అధికారి ఒకరు తెలిపారు.
పోర్న్ వీడియో విక్రయ ముఠాలు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాంల ద్వారా టీనేజ్, యువత అభిరుచులు పసిగడుతున్నాయి. నకిలీ అకౌంట్ల ద్వారా చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకొంటున్నాయి. కేవలం 24 గంటల్లోనే పోర్న్ వీడియోల ఉచ్చులోకి లాగేస్తున్నాయి. ఈ ముఠా హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంటర్ విద్యార్థినిని సైతం ట్రాప్ చేసినట్టు మహిళాభద్రత విభాగం అధికారులు సైబర్ పెట్రోలింగ్‌లో గుర్తించారు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ అమ్మాయి అప్పటికే చేయి దాటిపోయింది. 24 గంటలూ ఆ యావతోనే ఉంటున్నది. ఈ విద్యార్థినికి ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తూ, ఆ మైకం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎంతోమంది పిల్లలు పోర్న్ వీడియాలకు బానిసలుగా మారుతున్నారని ఒక పోలీసు అధికారి ఆవేదన వ్యక్తంచేశారు.