వికారాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది. చిన్నపాటి వానకే డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుండడం తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మురుగు నీటితో రోడ్లన్నీ కంపు..కంపుగా మారిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా పట్టించుకోవాల్సిన ప్రత్యేకాధికారులు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తుండడం గమనార్హం.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణ మినహా పారిశుధ్య నిర్వహణ పనులను ఆయా మున్సిపాలిటీ ల అధికారులు, సిబ్బంది గాలికొదిలేశారు. గత ఆరు నెలలుగా పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రధాన రహదారులతోపాటు పలు కాలనీల్లోని రోడ్లపై నిత్యం మురుగు నీరు పారుతుండడంతో ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే నాలుగు మున్సిపాలిటీల్లోని రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లింది. మురుగు నీరు పారుతుండడంతో తాగునీరు కూడా కలుషితం అవుతున్నది.
ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మురుగు నీరు రోడ్లపై పారుతుండడంతో దోమలు పెరిగి పోతున్నాయి. మురుగు నీటితో తాగునీరు కలుషితం అవుతుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో చలి జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వర్షాలు పడుతుండడంతో నీటి కాలుష్యం పెరగడంతోపాటు డ్రైనేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా, కామెర్ల వ్యాధులు వచ్చే అవకాశమున్నది.
వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షం పడిన సమయంలో డ్రైనేజీలు నిండి ఇండ్లలోకి వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవడంతోపాటు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చినట్లయితే దవాఖానలకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.