హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హౌసింగ్శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని చెప్పారు. పట్టణాల్లో స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారుల అవసరాలనుబట్టి గ్రౌండ్ ప్లస్ వన్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వొచ్చని అధికారులకు సూచించారు.