జనగామ, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తమది పేదల ప్రభుత్వమని, వారి సంక్షేమమే ధ్యేయంగా పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వులు చూడాలన్న తపనతో పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శనివారం జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడుతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, ఒకో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. రెండో విడుతలో 2.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో రెండు వేల ఇండ్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిండ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇం డ్లు మంజూరు చే స్తూ లబ్ధిదారులు ని ర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. అసంపూర్తిగా నిలిచిన ఇందిరమ్మ ఇండ్లు, మొండిగోడలతో ఉన్న ఇండ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇండ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడుతలో అమలు చేస్తున్నామని చెప్పారు.

జనగామ సభలో మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. సభలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. మంత్రి పొంగులేటి ప్రసంగిస్తుండగానే పాలపిట్ట రంగు చీరలు ధరించి గ్యాలరీ ముందు వరుసలో కూర్చున్న స్వయం సహాయక సంఘాల మహిళలు ఒక్కసారిగా లేచి ‘పింఛన్ రూ.4 వేలు ఏదీ? కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలే వస్తున్నయ్.. వంటగ్యాస్ సబ్సిడీ రూ.500 అన్నరు.. ఇప్పుడు రూ.1,050 తీసుకుంటున్నరు.. కిలో ఉల్లిగడ్డ రూ.70, మంచినూనె ప్యాకెట్ రూ.200 అయ్యింది.
ఎప్పుడైనా ఇంత పెరిగిందా? కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అన్నీ పెరిగినయ్’ అంటూ మహిళలు భగ్గుమన్నారు. పోలీసులు అడ్డుకుని ఇకడ అవన్నీ మాట్లాడొద్దు అని వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేసినా వినకుండా ‘మీరే చెప్పండి సార్లు.. మేం ఎట్లా బతుకాలి? ఎన్నికల ముందు కాంగ్రెసోళ్లు ఎన్నెన్ని మాయమాటలు చెప్పిండ్లు.. మూడేండ్లు దాటింది ఏం చేస్తున్నరు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘మాకు ఇండ్లు లేవు.. కిరాయికి ఉంటున్నం.. ఉన్నోళ్లకే ఇండ్లు ఇస్తున్నారు.. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెసోళ్లకే ఇచ్చుకున్నరు. అన్నీ దొంగ మాటలు చెప్తున్నరు’ అంటూ మహిళలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.