పెన్పహాడ్, జూన్ 24 : పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను, వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక కార్యక్రమాల నిర్వహణ, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమానికి సంబంధించిన స్క్రీనింగ్ వివరాలు, ఆన్లైన్ ఫాలో-అప్ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను నిరంతరం అప్డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ నెల 28వ తేదీ (ఆదివారం) జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పోలియో కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరాలను పరిశీలించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం పోలియో చుక్కలు అందేలా చూడాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించరాదని, క్షేత్రస్థాయిలో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం పని చేయాలని తగు సూచనలు జారీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్లు జయశ్రీ, నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇందిర, నాగలక్ష్మి, నాగమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.