కోటపల్లి : మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రకు (Maharashtra) అక్రమంగా వాహనంలో తరలిస్తున్న ఎరువులను (Fertilizers Seize ) కోటపల్లి పోలీసులు (Police) పట్టుకున్నారు. చెన్నూరులోని లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ దుకాణం నుంచి బొలెరో వాహనంలో డీఏపీ 32 బస్తాలు, 20-20 బస్తాలను మహారాష్ట్రకు తీసుకెళుతుండగా పట్టుకున్నట్లు కోటపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు.
జాతీయ రహదారి నెంబర్ 63 పై గురువారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా ఎరువులను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మహారాష్ట్రకు ఎరువులు తరలి వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. అందులో భాగంగా తనిఖీలు చేస్తుండగా వాహనం పట్టుబడినట్లు ఎస్సై వివరించారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.