హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసుశాఖకు చెందిన స్థలాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మించనున్నట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. వాటిని పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగిస్తామని తెలిపారు. పోలీసుల సంక్షేమంపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఏదుల గోపిరెడ్డి రచించిన వ్యాసాల సంపుటి ‘సంక్షేమ పోలీ సు – వ్యాసాలు, నివేదికలు’ అనే పుస్తకాన్ని బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కన్వెన్షన్‌హాల్ పోలీసు కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని, అదే మాదిరిగా ప్రతీ జిల్లాలో ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి పోలీసు తన పదవీ విరమణ నాటికి కనీసం సొంత ఇల్లు నిర్మించుకోవాలనే లక్ష్యంగా శాఖ పరంగా సహకారం కల్పిస్తున్నామని స్పష్టంచేశారు. విధి నిర్వహణలో వస్తున్న మార్పులను స్పృశిస్తూ గోపిరెడ్డి రాసిన వ్యాసాల సంపుటి రిఫరెన్స్బుక్గా ఉపయోగపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖపై ప్రజల్లో సానుకూల వైఖరి కల్పించేందుకే ఈ వ్యాసాలు రాసినట్టు గోపిరెడ్డి తెలిపారు.