ఆయన నిప్పులు చెరిగే ఒక ఉప్పెన. దురహంకార అధికారం ఎక్కడ పంజా విసురుతుందో అక్కడ చెలరేగే ఒక అక్షర జ్వాల. పీడిత ప్రజల కోసం కలంతో యుద్ధం చేసే ఒక అత్యున్నత కవి చక్రవర్తి. ఆయన ఒక నిత్య చైతన్య కవితా ప్రవాహం. అన్యాయాన్ని, అవినీతిని ఛేదించే కవితాక్షర కాంతి కిరణం. ఆయనే కవిరాజమూర్తిగా పేరుపొందిన సర్వ దేవభట్ల నరసింహమూర్తి.
కవి రాజమూర్తి 1926 అక్టోబర్ 16న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో నర్సమ్మ-వీరభద్రయ్య దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఖమ్మంలోని మామిళ్లగూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన ఆనాటి నియంతృత్వ భూస్వామ్య అధికారులకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని హైదరాబాద్, గుల్బర్గా జైళ్లలో శిక్షను అనుభవించిన ఉద్యమ కవి ఆయన.
రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన మానవతా మూర్తి కవి రాజమూర్తి. మధ్యతరగతి జీవుల ఆవేదనను తన కవిత్వంలో ప్రతిబింబించిన అచ్చమైన ప్రజాకవి ఆయన. ఖమ్మం జిల్లాలో ‘ప్రజా సాహిత్య పరిషత్తు’ అనే సాహిత్య సంస్థను ఏర్పాటుచేసి కొత్త తరం కవుల సాహిత్య చైతన్యానికి వెలుగుబాటలు దిద్దారు.
మహైక, మానవత చావదు, చివరి రాత్రి, జముకుల కథ, ప్రణుతి, మధుధారలు, మై గరీబ్ హూ, స్వీయ గీతిక, లహూకీ లకీర్, అంగారే మొదలైన 15 కావ్యాలు రాశారు. ఇందులో ‘మై గరీబ్ హూ’ నవల సమకాలీన సమాజాన్ని గురించి ఎన్నిరకాలుగా ఆవిష్కరించాలో అన్ని రకాలుగా ఆవిష్కరించబడింది. ఈ నవల ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అప్పటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూకు ఈ పుస్తకాన్ని అంకితం చేయడం నెహ్రూతో ఆయనకు గల అనుబంధాన్ని వ్యక్తం చేస్తుంది. తెలుగులో తొలి వచన దీర్ఘ కవితా కావ్యం ‘మహైక’ 1952లో రాశారు. ఆయన కంటే ముందు వచన కవితలో దీర్ఘకావ్యం ఎవరు రాయలేదు.
మహాకవి దాశరథితో కవి రాజమూర్తికి ఉన్న అనుబంధం విడదీయరానిది. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని దాశరథి, మర్రి చెన్నారెడ్డి, మదన్మోహన్లతో అనేక సార్లు జైలుశిక్ష అనుభవించారు కవి రాజమూర్తి. దాశరథితో కలిసి సుదీర్ఘమైన సాహిత్య చర్చలు చేసేవారు ఆయన. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి నిరంతరం తపించేవారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారు. తెలుగు పండితుడిగా పనిచేస్తున్న తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రజల కోసమే జీవించిన అచ్చమైన మచ్చలేని ప్రజల మనిషి కవి రాజమూర్తి. అందుకే నేటికీ ఖమ్మం పట్టణంలో ఆయన నివాసం ఉన్న ప్రాంతానికి ‘కవి రాజనగర్’ అని పేరు పెట్టుకొని ఆయన్ని నిత్యం స్మరించుకుంటున్నారు. కావ్యాలు రాయడమే కాకుండా ఆశువుగా కవిత్వం చెప్పేవారు కవి రాజమూర్తి. ఎక్కడ అన్యాయం కనబడుతుందో అక్కడ ఆశు కవిత్వంతో అవతరించేవాడు ఆయన. అన్యాయాన్ని నిరసిస్తూ ఆయన ఆశువుగా చెప్పిన పద్యాలు, పాటలు అణగారిన ప్రజల్లో చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆవిష్కరించేవి.
రాజసం నింపుకొన్న కవిని, కవిత్వం నింపుకొన్న రాజసాన్ని ఆయనలో చూసిన బూర్గుల రామకృష్ణారావు సర్వదేవభట్ల నరసింహమూర్తి అనే పేరును కవి రాజమూర్తిగా మార్చారు. అప్పటినుంచి ఆయన కవి రాజమూర్తిగా పిలువబడుతున్నారు. ఆయన విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరగడం వల్ల ఉర్దూలో కూడా కొన్ని పుస్తకాలు రాశారు. దాశరథి, హీరాలాల్ మోరియా, కొలిపాక మధుసూదన్, బూర్గుల రామకృష్ణారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటి మహానుభావులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. వారితో అనేక సాహిత్య, సామాజిక చర్చలు చేసేవారు కవి రాజమూర్తి.
ప్రముఖ ఉర్దూ కవులైన ఉమర్ ఖయ్యూం, మీర్జా గాలిబ్ల ఉర్దూ గజళ్ళను తెలుగులో ‘మధుర ధారలు’ పేరున అనువాదం చేశారు ఆయన. ‘లహూకీ లకీర్’ ఉర్దూ నవల, ‘అంగారే’ ఉర్దూ కవితా సంపుటిని రాసి తెలుగులోనే కాదు, ఉర్దూలో కూడా ఆయనకున్న ప్రతిభను నిరూపించుకున్నారు. తన కలంలోనే కాదు గళంలో కూడా సింహగర్జన వినిపించిన కవి రాజమూర్తి 1995 జూన్ 5న పరమపదించినప్పటికీ సాహితీ లోకంలో ఎల్లప్పుడూ జీవించే ఉంటారు.