బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్రమంత్రిని.. ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురుదెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బాధ్యతగల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకుకోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయట పడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది.
కర్మ ఎవర్నీ వదలదు! ఎవర్ని పడితే వాళ్లను కేసులు పెడుతామని, జైల్లో తోస్తామని బెదిరింపులకు దిగితే… అదే ఒకనాడు ఎదురుతిరిగి వడ్డీతో సహా తిరిగిస్తుంది! తండ్రి తంతెల మీద ఉంటే కొడుకు కోనేట్ల ఉంటడా? బండి భగీరథ దాన్ని రుజువు చేశాడు. కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా, పోలీసులు మూడు నెలలపాటు సాగదీసి సహకరించినా కాలం కలిసిరాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తూ చిత్తయ్యింది. రాజీ కోసం చేసిన బెదిరింపులూ పనిచేయలేదు. బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది.
ఇటీవల యూపీలో ఒక అమ్మాయి మీద లైంగికదాడి జరిగితే.. నిందితుడి తల్లిదండ్రులు ఒక్కటే చెప్పారు! ‘తప్పు చేసింది ఎవరైనా తప్పు తప్పే! మా కొడుకును కావాలంటే ఎన్కౌంటర్ చేసుకోండి’ అని తెగేసిచెప్పారు. ఆడబిడ్డ వేదన తెలిసిన సామాన్యుడి స్పందన ఎంత హుందాగా ఉన్నది? మరి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల బండి సంజయ్ ఏం చేయాలి? కొడుకుకు అంటకాగుతూ బాధిత బాలికపైనే ఉల్టా కేసు పెట్టేందుకు ఎందుకు సహకరించారు? ఇదేనా బీజేపీ చెప్పే ‘బేటీ బచావో’? ఇదేనా ‘నారీశక్తి సమ్మాన్’?
హైదరాబాద్ సిటీబ్యూరో/కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. బాలికను ట్రాప్ చేసి పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై కేసు నమోదు చేసినట్టు పేట్ బషీరాబాద్ సీఐ విజయ్‌వర్ధన్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. అంతకు ముందు రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాకుండా పోలీస్ స్టేషన్లో పెద్ద హైడ్రామా నడిచింది.
ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను 2025 జూన్‌లో తన స్నేహితుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా ఉన్న తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. 18 ఏండ్లు నిండిన తర్వాత పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిరుడు అక్టోబర్ 25న ఆమెను నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తన స్నేహితులతో కలిసి తీసికెళ్లాడు. అక్కడ రెండు మూడు రోజులు ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ శారీరక హింసకు గురిచేశాడు. ఆ తర్వాత నవంబర్‌లో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసికెళ్లి అక్కడా వేధింపులకు గురి చేశాడు. నిరుడు డిసెంబర్ 31న రాత్రి బాలికను మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు.
అక్కడికి తన స్నేహితులు ఐదుగురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత ఫుల్లుగా మద్యం తాగిన భగీరథ, బాలిక గదిలోకి ప్రవేశించి ఆమెకు మద్యం తాగించేందుకు విశ్వప్రయత్నం చేసి, ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. లైంగిక చర్యకు ఒప్పుకోవాలంటూ ఆమెను తీవ్రంగా ఒత్తిడి చేయడంతో బాలిక అందుకు నిరాకరించింది. అక్కడున్న పరిస్థితులు, భగీరథ్ ఒత్తిడితో బాలిక తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడమే కాకుండా ఆమె పైచదువుల కో సం లండన్ వెళ్లనీయకుండా భగీరథ్ కట్టడి చేశాడు. దీంతో బాలిక మానసికంగా కుంగిపోయింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విరామం వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేయడమే కాకుండా, ఒక ఫంక్షన్లో స్నేహితులతో కలిసిన సమయంలో బాలికను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడటంతో బాలిక మరింత కుంగిపోయింది.
అతడి చేష్టలతో రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనను మోసం చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నావంటూ భగీరథ్‌ను నిలదీసింది. ‘నా వెనుక పెద్ద బాక్గ్రౌండ్ ఉన్నది.. నువ్వేం చేస్తవ్ నన్ను?’ అంటూ బెదిరించడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనకు చేసిన మోసంపై అన్ని ఆధారాలూ ఉన్నాయని, పోలీస్‌స్టేషన్‌లోనే తేల్చుకుంటానని భగీరథ్‌కు చెప్పడంతో ముందుగా అప్రమత్తమై ఏప్రిల్‌లో నిర్మల్ పోలీసులకు తన స్నేహితుడు శ్రీరామ్‌తో భగీరథ్ ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి పలుకుబడితో నిర్మల్ పోలీస్ అధికారి ఒకరు బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అక్కడ కేసు నమోదు చేసినట్టుగా బెదిరించారు. ఓవైపు భగీరథ్ వేధింపులు, మరోవైపు పోలీసుల బెదిరింపులతో మానసికంగా మరింత వేదనకు గురైంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడు వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. బండి సంజయ్ వద్దకు తీసుకెళ్లి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కొడుకు చేసింది తప్పని చెప్పాల్సిన బండి, తన కొడుకును వెనకేసుకు రావడమే కాకుండా బాధితులపైనే బెదిరింపులకు దిగాడు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేయాలని భావించిన బాధిత కుటుంబం శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
బాలికపై లైంగిక దాడికి యత్నించిన భగీరథ్‌పై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం వెళ్తే గంటల తరబడి ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిరాకరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకుపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి చర్చలు నడిపారు. ‘మీ ఫిర్యాదును వెంటనే న్యాయ సలహాకు పంపాలి. ఆ తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం’ అంటూ ఆలస్యం చేశారు. సుమారు ఆరు గంటల పాటు బాధితులను పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. అప్పటికే విసుగెత్తిన బాధిత కుటుంబం ఫిర్యాదు తీసుకోకుంటే కోర్టుకు పోతామని, ఆదివారం జరిగే మోదీ సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో పోలీసులకు చివరికి భగీరథ్‌పై కేసు నమోదు చేశారు.