కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందా?, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని ముందుగానే భావించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ విషయం ఫోకస్ కాకుండా డైవర్టు చేసేందుకు దాడికి పురిగొల్పారా?, దాడిలో పాల్గొన్న బీజేపీ నాయకులు బండి వ్యూహంలో చిక్కుకున్నారా? అంటే అవుననే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే నడుస్తున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భగీరథ్‌పై కేసు నమోదు చేసేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని అమ్మాయి తల్లిదండ్రులు కొద్దినెలలుగా తెగేసి చెపుతున్నట్టుగా తాజా ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఏ క్షణంలోనైనా భగీరథ్ మెడకు కేసు చుట్టుకోక తప్పదని ముందుగానే బండి సంజయ్ అర్థం చేసుకున్నట్లుగా తాజా పరిస్థితులను బట్టి తెలుస్తున్నది.
ఆదివారం ప్రధాని మోదీ సభకంటే ముందు తన కొడుకుపై పోక్సో కేసు నమోదైతే.. మీడియా దృష్టి ఆ వ్యవహారంపై ఉంటుందని, తనకు చెడ్డ పేరు వస్తుందని భావించి ఎలాగైనా సరే ఏదో ఒక ఘటనతో విషయాన్ని డైవర్టు చేయాలని బండి సంజయ్ భావించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం పార్టీ శ్రేణుల వద్ద ఎక్కడా బయటపడకుండా సంజయ్ జాగ్రత్త పడ్డారు. నిజానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆ రోజు పెట్టిన ప్రెస్మీట్లో అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదు. బండి సంజయ్ చేసిన విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూనే చర్చకు సవాల్ విసిరారు. ఇటువంటి విమర్శలు, ప్రెస్మీట్లు గతంలోనూ అనేకసార్లు పాడి కౌశిక్‌రెడ్డి పెట్టారు. వాటికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కానీ ఎప్పుడూ లేనివిధంగా ఈ నెల 7న ఏకంగా ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు దాడికి యత్నించారు.
అక్కడితో ఆగకుండా క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రెండ్రోజులసాటే మీడియా డైవర్షన్ మొత్తం ఈ ఘటనపైకి మళ్లింది. మోదీ సభ అయిపోయేవరకు తనయుడి వ్యవహారం బయటకు రాకుండా క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారన్న చర్చ ప్రస్తుతం అన్ని వర్గాల్లో జరుగుతున్నది. కొడుకు అకృత్యాలు బయటకు రాకుండా ఉండేందుకు బండి సంజయ్ వేసిన ప్లాన్‌లో తాము బలయ్యామన్న అభిప్రాయం కేసులు నమోదైన శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో బండి వ్యూహాల్లో చిక్కుకోవద్దని పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.