తిరువనంతపురం, అక్టోబర్ 15: కేరళలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వచ్చే భక్తుల దర్శనంపై విధించిన ఆంక్షల విషయంలో పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు సైతం శబరిమల అయ్యప్పను సాఫీగా దర్శనం చేసుకోవచ్చునని మంగళవారం ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామంటూ ఇంతకుముందు విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తం అయ్యింది. దీంతో సీఎం విజయన్ మంగళవారం దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులతో పాటు, రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన భక్తులకు కూడా దర్శనం కల్పిస్తామని తెలిపారు. వర్చువల్ బుకింగ్‌ను విపక్షాలు, భక్తులు విమర్శి ంచడంతో సర్కార్ దిగివచ్చింది.