SAND | కోల్ సిటీ, ఆగస్టు 8 : ఇసుక బంగారమైంది.. ఉచితం మాటున అక్రమ రవాణా జరుగుతోంది. ఈ దందా వెనుక రాజకీయ నాయకుల అండ కొండంతగా ఉంది. ఇటీవల కాలంగా ఇసుక మాఫియా మరింత బరి తెగించింది. అక్కడెక్కడో మారుమూల ప్రాంతం కాదు.. గోదావరిఖని నగరం నడిబొడ్డునే ఇసుక దందాకు తెరలేచింది. స్థానికుల ఇసుక అవసరాల వెసలుబాటును కొంతమంది ముఠా క్యాష్ చేసుకుంటోంది. రామగుండం నగర పాలక సంస్థ పరిధి జనగామ గ్రామ శివారులో ఇసుక డంపులను చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉంది.
ప్రక్కనే గోదావరి నది నుంచి స్థానికుల ఇళ్ల నిర్మాణం పేరుతో కొంతమంది భారీ మొత్తంలో ఇసుకను తోడ్కొని గోదావరిఖని నగరంలోని పలు చోట్ల డంప్ చేస్తున్నారు. దీనిలో భాగంగా జనగామ శివారులోని చెట్ల పొదల్లో దాదాపు 600 ట్రిప్పుల ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం ఆరోపణలకు తావిస్తుంది. ఇదే జనగామకు చెందిన ఓ సింగరేణి కార్మికుడు ఒకరు తన నూతన ఇంటి నిర్మాణం కోసం గోదావరి నది నుంచి రెండు రోజుల కిందట ట్రాక్టర్ ఇసుక తీసుకవచ్చిన కొద్ది గంటల్లోనే ఓ పోలీస్ కానిస్టేబుల్ బెరమాడగా వినకపోవడంతో రామగుండం రెవెన్యూ అధికారుల కు సమాచారం ఇవ్వగా అగమేఘాల మీద వచ్చి ఆ ఇసుకను సీజ్ చేశారు.
కానీ, అక్కడే సమీపంలో వందల ట్రిప్పుల కొద్ది ఇసుక డంప్‌ల జోలికి మాత్రం వెళ్లలేదు. అలాగే నగరంలోని సంజయ్ గాంధీనగర్ లో సైతం ఇదే తరహాలో ఇసుక డంప్‌లను ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. స్థానికుల ఇళ్ల నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుకను తీసుకవెళ్లే వెసలుబాటును ఆసరాగా చేసుకొని ఇసుకాసురులు సంజయ్ గాంధీనగర్‌లో భారీగా ఇసుకను నిల్వ చేసి అనంతరం హైదరాబాద్‌కు లారీ లోడుకు రూ.50వేల చొప్పున వసూలు చేసి తరలిసున్నారు.
ఈ తతంగం బయటపడటంతో రెండు రోజుల క్రితం గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇసుక డంప్ లను సీజ్ చేశారు. ఐతే అదే తరహాలో జనగామ శివారులోని చెట్ల పొదల్లో ఓసీపీ కుప్పలను తలపించే విధంగా ఇసుక డంపు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై రామగుండం తాసీల్దారు వివరణ కోరగా, ఇసుక డంప్ లు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయనీ, పోలీసుల సహకారంతో విచారణ జరిపి వాటిని సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.