యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) ;యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా మారింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుకున్నది. స్వామివారిని దర్శించుకునేందుకు, ఆలయ కట్టడాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గతంలో కంటే భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అన్ని వసతులు సమకూర్చడంతో భక్తులు ప్రశాంతంగా స్వామి సేవలో తరించి వెళ్తున్నారు. ఆలయానికి ఆదాయం కూడా పెరిగింది.
రోజుకు 20వేల మందికిపైగా..
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1300 కోట్లతో గుట్ట ఆలయాన్ని పునరుద్ధరించింది. గతంలో పోలిస్తే ఆలయ రూపురేఖలు మారిపోయాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్నది. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు, రోజుకు 5వేల మందిలోపు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. అంటే నెలకు రెండు లక్షలలోపు దర్శించుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రోజుకు సగటున సుమారు 20వేల మందికిపైగా విచ్చేస్తున్నారు. దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్తిక మాసంలో నవంబర్ 18న ఒకేరోజు లక్ష మందికి పైగా భక్తులు వచ్చారు. దాంతో కొండపైన, గుట్ట కింద భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. గత ఆరు నెలలు వరుసగా చూస్తే జూలైలో 3.20లక్షలు, ఆగస్టులో 5.81లక్షలు, సెప్టెంబర్‌లో 3.17లక్షలు, అక్టోబర్‌లో 6.39లక్షలు, నవంబర్‌లో 10.96లక్షలు, డిసెంబర్లో 8.11లక్షల మంది యాదగిరీశుడి సేవలో తరించారు.
దేశ, విదేశాల నుంచి రాక
లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇతర దేశాల్లో సెటిలైన వారు సైతం స్వామివారి కోసం ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు. వీకెండ్స్‌లో గుట్ట పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గుట్ట కింది నుంచి కొండపైకి వెళ్లే దారులు ఎప్పుడూ రద్దీగా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆధ్యాత్మిక, ఆహ్లాద వాతావరణంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుండడంతో భక్తులు పదే పదే వచ్చి స్వామివారి కృపలో భాగమవుతున్నారు. కోరికలు తీరుతుండటంతో మొక్కులు చెల్లించేందుకూ క్యూకడుతున్నారు. పండుగలు, పెండ్లిళ్ల సీజన్లలో సైతం వేల సంఖ్యలో కుటుంబసభ్యులతో తరలి వస్తున్నారు.
విశేషంగా ఆకట్టుకుంటున్న నిర్మాణాలు
వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత అద్భుతంగా, సువిశాలమైన స్థలంలో జరిగాయి. 17ఎకరాల్లో ఆలయాన్ని విస్తరించారు. ప్రధానాలయం, కృష్ణశిలతో నిర్మించిన శిల్పాలు, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల గోపురాలు, రథశాల, ఆకర్షణీయమైన క్యూకాంప్లెక్స్లు, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపం, కల్యాణకట్ట, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భక్తులకు సకల సదుపాయాలు
గుడి పునర్నిర్మాణం తర్వాత భక్తుల సదుపాయాలు కల్పించడంలో ఆలయ అధికారులు ముందంజలో ఉన్నారు. అన్ని హంగులతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నారు. గుట్ట కింది నుంచి కొండ పైకి ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. భక్తులు ఉండటానికి ప్రెసిడెన్షియల్ సూట్, కింద అద్దె సదన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని చోట్లా తాగునీటిని ఏర్పాటు చేశారు. గుట్ట, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు అందంగా తీర్చిదిద్దుతున్నారు. పరిశుభ్రతకు మారుపేరుగా నిలిపారు.
అంతకంతకూ పెరిగిన ఆదాయం
పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆరు నెలల్లో సుమారు రూ. 106 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు సగటున రూ.10లక్షల లోపు ఉండేది. ఇప్పుడు సగటున రూ.40లక్షలకు పెరిగింది. బుకింగ్స్, వ్రతాలు, ప్రసాద విక్రయాలు, సువర్ణ పుష్పార్చన, అన్నదానం, బ్రేక్ దర్శనం, వాహన ప్రవేశం తదితర రూపాల్లో ఆదాయం సమకూరుతున్నది. ఇటీవల రికార్డు స్థాయిలో ఒకే రోజు రూ. కోటి దాటింది. జూలైలో రూ.12.55కోట్లు, ఆగస్టులో రూ.13.16 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.8.15కోట్లు, రూ.అక్టోబర్‌లో 15.82 కోట్లు, నవంబర్‌లో రూ.40.66 కోట్లు, డిసెంబర్లో రూ.15.87 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక విదేశీ కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో సమకూ రుతున్నది.