హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా టీఆర్ఎస్కు అధిష్ఠానం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీఆర్ఎస్కు బాసులెవరూ లేరని, ఉన్న ఒకే ఒక బాస్ తెలంగాణ ప్రజలేనని చెప్పారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజాపునాది గల ఏకైక పార్టీ
తెలంగాణలో అద్భుత ప్రజాపునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. అనేక ఎన్నికలు చూస్తున్నాం.. ఒకచోట కాంగ్రెస్‌కు, మరోచోట బీజేపీకి డిపాజిట్ రాని పరిస్థితి. కానీ యూనిఫాంగా కాగజ్‌నగర్ నుం చి గద్వాల వరకు, జుక్కల్ నుంచి భద్రాచలం వరకు తెలంగాణలో నలువైపులా అద్భుత ప్రజా పునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. అద్భుతమైన భవిష్యత్ ఉన్న పార్టీ. గొప్పగా పురోగమించే దృతువు ఉన్న పార్టీ. మనం తలపెట్టిన కార్యక్రమం అవరోధాలు, ఆటంకాలున్నా ముందుకు పోతున్నాం. ఇదే దృతువు, ఉధృతిని ఇకముందూ కొనసాగించాలి. ఒక వ్యక్తి వల్ల ఇది సాధ్యంకాదు. ఈ అద్భుతమైన ఆవిష్కరణల్లో, విజయాల్లో మనందరం భాగస్వాములమే. అందరం పాలుపంచుకొని కష్టపడ్డాం కా బట్టే ఇన్ని గొప్ప విజయాలు సాధించగలిగాం. ఇం కా సాధించాల్సింది.. చేయాల్సింది చాలా ఉన్నది.
దేశ రాజధానిలో గులాబీ పతాకం రెపరెపలు
31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో స్థలాలను ఫైనల్ చేస్తున్నారు. త్వరలో ఆ కార్యాలయాల నిర్మాణం పూర్తిచేస్తాం. మలిదశలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతున్నాం. రూ.10 కోట్లు చెల్లిం చి కేంద్రంతో బాజాప్తా జాగా అలాట్ చేయించుకొని ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ కార్యాలయానికి శం కుస్థాపన చేసుకున్నాం. ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సారథ్యం లో భవన నిర్మాణ పనులు తొందర్లోనే ప్రారంభం కాబోతున్నాయి. 8-10 నెలల్లో ఢిల్లీలో సగర్వంగా మన టీఆర్ఎస్ కార్యాలయంపై మన గులాబీ పతా కం రెపరెపలాడుతుంది.
కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు
పార్టీ కార్యాలయాలు నిర్మాణమై ఉన్నాయి కా బట్టి.. భవిష్యత్‌లో గొప్పశక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దడానికి 8-9 మాసాలపాటు నిరంతర, కఠినమైన శిక్షణ తరగతులు నిర్వహిద్దాం. మన ఆచరణ, కార్యాచరణ, మన లక్ష్యం ఏమిటన్న విషయాలను కార్యకర్తలతోపాటు ప్రజలకు కూడా చెప్తాం.
నా జీవితం అంకితం
ఇలాంటి అద్భుత సందర్భంలో మరొక్కమారు నాకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా కలిగించిన మీ అందరికీ పేరు పేరున హృ దయపూర్వక ధన్యవాదాలు. మీరు అప్పజెప్పిన ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో, బాధ్యతతో నిర్వర్తించి మీ గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని పెంచడానికే నా జీవితాన్ని అంకితం చేస్తా.
బెదిరిపోయే పార్టీ కాదు
హరాకిరీగాళ్లు, పనికిమాలిన వాళ్లు, అవగాహనా రాహిత్యంతో, తెలివి తక్కువతనంతో అడ్డం పొడుగు మాట్లాడితే బెదిరిపోయే పార్టీ కాదు టీఆర్ఎస్. ఆర్థికంగా బలోపేతమైన పా ర్టీ. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ. సభ్యుల ఇన్సూరెన్స్ కోసమే ప్రతియేటా రూ.20 కోట్లు చెల్లించే పార్టీ. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కా ర్యాలయాలు కలిగి ఉన్న పార్టీ. శాశ్వతంగా తాను నిలిచి గెలవడమే కాదు.. తనను ప్రే మించినటువంటి, తనను నడిపించినటువం టి, తనను దీవించినటువంటి తెలంగాణ సమాజాన్ని కూడా తలెత్తుకు తిరిగేలా చేసిన పార్టీ. అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి బ్రహ్మాండంగా కొనసాగించి, ఈ రాష్ర్టాన్ని అన్ని రకాలుగా గొప్పగా ముందుకు తీసుకెళ్దామని మనవిచేస్తున్నా. మనం సాధించుకున్న తెలంగాణను సక్కదిద్దుకోవడానికి మంచి పంథాను మనం ఎన్నుకొన్నాం. అద్భుతమైన ప్రగతి సాధించినం. అడ్డదిడ్డంగా మాట్లాడే వారికి సరైన జవాబు చెప్దాం.