
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అవినీతిపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ప్రజలను లంచాల కోసం పీడించే అవినీతి అధికారులపై ఏసీబీ కేసుల కొరడా ఝళిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు అక్రమార్కుల పనిపడుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 2021 నవంబర్ వరకు వివిధ ప్రభుత్వ శాఖలన్నింటిలో కలిపి 257 కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ప్రజలను చైతన్యం పరిచేందుకు ఏసీబీ అధికారులు టోల్‌ఫ్రీ నంబర్ 1064, జిల్లా ఏసీబీ అధికారుల ఫోన్ నంబర్లతో పోస్టర్లు, కరపత్రాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పలుకేసుల్లో వందల కోట్ల రూపాయల అవినీతిని అవినీతి నిరోధక శాఖ బట్టబయలు చేసింది. కీలక కేసులలో వందల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఏసీబీ అధికారులు వెలికితీశారు. అధికారుల అవినీతిపై ఫిర్యాదుకు ఏసీబీ కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. గత మూడేండ్లలో ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు 389 మంది పౌరులు ఫిర్యాదు చేశారు. 2020లో కరోనా పరిస్థితుల కారణంగా ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. ఆయా జిల్లాల ఏసీబీ డీఎస్పీలకు, ఈమెయిల్స్, వాట్సప్ నంబర్ ద్వారా, నేరుగా ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం ఇలా పలుమార్గాల్లో వస్తున్న ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది.
పెద్దపల్లి ఆర్డీవో సస్పెన్షన్
పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కుడికల శంకర్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రూ.9.28 లక్షల బిల్లు మంజూరు కోసం శంకర్‌కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఈ నెల ఒకటిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం న్యాయస్థానం ఆయనకు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో శంకర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు అధికారులకు మూడేండ్ల జైలు
అవినీతి ఆరోపణలు నిరూపితం కావడంతో ఇద్దరు రెవెన్యూ అధికారులకు మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పెషల్ జడ్జి సాంబశివరావు నాయుడు గురువారం తీర్పునిచ్చారు. 2008లో అప్పటి మెదక్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బుక్క వెంకటేశంకు ల్యాండ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రూ.7 వేలు లంచం డిమాండ్ చేసిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాకాల హన్మంత్‌రావు, వీఆర్వో ఎట్టిరెడ్డి వెంకట నర్సింహారెడ్డిలను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు పక్కాగా దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలతో సహా కేసు నిరూపితం కావడంతో జడ్జి గురువారం తుది తీర్పు వెల్లడించారు. ఇద్దరు నిందితులకు మూడేండ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.
అవినీతికి పాల్పడ్డారో అంతే..
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాల, లోక్‌సత్తా ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓ వ్యక్తి అరగుండు, అరమీసంతో గాడిదపై కూర్చోని మెడలో చెప్పులు, చీపురు దండతో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అవినీతికి వ్యతిరేకంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది.
