మనసుదోచిన చెలికాడితో ముద్దుముచ్చట్లలో మునిగితేలితే అతివకు అంతకుమించిన ఆనందం ఏముంటుంది? పంజాబీ చిన్నది పాయల్‌రాజ్‌పుత్ అదే ఆనందానుభూతిలో ఉందట. అయితే ఇదంతా వెండితెరపైనే అని చెప్పిందీ చిన్నది. నచ్చిన తోడుతో కలిసి వెండితెరను పంచుకోవడం మహాద్భాగ్యంగా భావిస్తున్నానని ఈ అమ్మడు సంబరపడిపోతున్నది. వివరాల్లోకి వెళితే… గత కొంతకాలంగా సౌరభ్ ధింగ్రా అనే యువకుడితో ప్రేమాయణాన్ని సాగిస్తున్నది పాయల్‌రాజ్‌పుత్. తాజాగా ఈ ప్రేమికుల జోడీ కలిసి ‘త్రీ రోజెస్’ అనే తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. తెరపై తామిద్దరం కలిసి నటించడం ఓ మ్యాజిక్‌లా జరిగిపోయిందని చెప్పింది పాయల్‌రాజ్‌పుత్. అంతకుముందు ఈ జంట కలిసి ‘మౌలా మేరా మౌలా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. ఇందులో వారిద్దరి స్క్రీన్‌ప్రజెన్స్ నచ్చడంతో ‘త్రీ రోజెస్’ దర్శకుడు మారుతి సిరీస్ కోసం తీసుకున్నారట. ఈ విషయం గురించి పాయల్‌రాజ్‌పుత్ మాట్లాడుతూ ‘తొలుత నన్ను నాయికగా ఖరారు చేశారు. ఆ తర్వాత సౌరభ్‌ను హీరోగా తీసుకుంటున్నామని దర్శకుడు చెప్పడంతో సంతోషంగా అనిపించింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. మా ఇద్దరి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. రియల్లైఫ్లోనే కాదు రీల్‌లైఫ్‌లో కూడా మా జోడీ కన్నులపండువగా ఉంటుంది’ అని మురిసిపోయింది పాయల్‌రాజ్‌పుత్.