Murali Nayak | భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో సాగుతున్న భీకర పోరులో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. పాక్ జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మురళీ నాయక్ కుటుంబంతో పాటు ఊరిలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. కాల్పుల జరిగిన సమయంలో 14మందిని మురళీనాయక్ మట్టుపెట్టాడని, వాళ్లను ఎటాక్ చేసి తిరిగి వెనక్కు వస్తున్నసమయంలో మురళీని ఎటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్లు అన్నారు అని మురళీ నాయక్ తండ్రి చెప్పుకొచ్చారు. ఇక మురళీ నాయక్ మృతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు, నారా లోకేష్ సంతాపం తెలియజేశారు.
ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లితండ్రులు శ్రీమతి జ్యోతి బాయి గారికి, శ్రీ శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది అని పవన్ తను విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు
నందమూరి బాలకృష్ణ కూడా తన సానుభూతిని ప్రకటించారు. దేశ రక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని బాలయ్య అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీరుడైన మురళి నాయక్ గారికి అశ్రు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ బాలయ్య అన్నారు. ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం తెలిపారు.