మియాపూర్, సెప్టెంబర్ 25:మత్తుకు బానిసలై పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగిని అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న సహచరులే దారుణంగా హత్య చేశారు. చిన్నచిన్న తగాదాలతో ఆగ్రహం పెంచుకుని విచక్షణారహితంగా కొట్టి చంపారు. మియాపూర్ సీఐ శివప్రసాద్ గురువారం తెలిపిన ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్(39) డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అతడిని మత్తు బానిస నుంచి విముక్తుడిని చేసేందుకు కుటుంబసభ్యులు మియాపూర్ ఠాణా పరిధిలోని నాగార్జున ఎన్‌క్లేవ్‌లోని ఓ భవనంలో కొనసాగుతున్న రఫా పునరావాస కేంద్రంలో 8నెలల కిందట చేర్పించారు.
అప్పటి నుంచి సందీప్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. కాగా, మత్తు పదార్థాల బారినపడి ఇదే కేంద్రంలో నల్గొండకు చెందిన ఆదిల్, బార్కస్‌కు చెందిన సులేమాన్ సైతం నెలరోజులుగా చికిత్స పొందుతూ సందీప్ గదిలోనే ఉంటున్నారు. బుధవారం రాత్రి ముగ్గురి మధ్య గొడవ చోటు చేసుకున్నది.
దీంతో తరచూ తమతో సందీప్ గొడవపడుతుండటం పట్ల ఆగ్రహం పెంచుకున్న ఆదిల్, సులేమాన్ అదే భవనంలోని కిచెన్ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న కట్టెతోపాటు నీల్ కట్టర్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో సందీప్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గుర్తించిన సిబ్బంది సందీప్‌ను హుటాహుటిన శ్రీకర దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, సందీప్‌ను హత్య చేసిన వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శివప్రసాద్ పేర్కొన్నారు.