సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగొద్దు
నూతన సహకార వ్యవస్థపై కేంద్రానికి పార్లమెంటు హౌస్కమిటీ సిఫారసు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రూపొందించనున్న కొత్త సహకార విధానంలో రాష్ర్టాల హక్కులకు భంగం వాటిల్లకుండా, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగకుండా చూడాలని పార్లమెంటు హౌస్కమిటీ స్పష్టంచేసింది. ఈ విషయంలో అత్యంత వివేకంగా వ్యవహరించాలని సూచించింది. రాజ్యాంగం ప్రకారం సహకార వ్యవస్థ రాష్ర్టాల పరిధిలోని అంశమని కేంద్రానికి గుర్తుచేసింది. బీజేపీ సభ్యుడు పీసీ గాడిగౌడర్ నేతృత్వంలో వ్యవసాయం, పశు సంవర్ధక, ఆహారశుద్ధిపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ లోక్సభకు గురువారం నివేదిక సమర్పించింది. అమిత్షా నేతృత్వంలో 2021 జూలైలో ఏర్పడిన సహకార మంత్రిత్వశాఖ ఇంకా ముసాయిదాను రూపొందించే దశలోనే ఉన్నందున తమ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. కొత్తగా రూపొందించనున్న జాతీయ సహకార విధానం సమాఖ్య స్వభావానికి అనుగుణంగా ఉండాలని, వాటాదారులకు కూడా సముచిత ప్రయోజనం కలిగించేలా ఉండాలని సూచించింది. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త సహకార విధానం ‘సహకార్ సే సమృద్ధి’ దోహదపడాలని ఆకాంక్షించింది. కొత్త సహకార విధానంపై ఇప్పటివరకు 35 వాటాదారులు, 10 మంత్రిత్వశాఖలు, 6 రాష్ర్టాల నుంచి స్పందనలు అందినట్టు స్టాండింగ్ కమిటీకి మంత్రిత్వశాఖ తెలిపింది.