భోపాల్: స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ రికార్డు స్థాయిలో 11వ సారి జాతీయ బిలియర్డ్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. మంగళవారం ముగిసిన మెగా ఫైనల్లో పంకజ్ 5-2తో తన స్నేహితుడు ధ్రువ్ సిత్వాలాపై విజయం సాధించాడు. తొమ్మిది గేమ్‌ల తుది పోరు ఆరంభంలో ధ్రువ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న పంకజ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఓవరాల్‌గా పంకజ్ కెరీర్లో ఇది 35వ టైటిల్ కావడం విశేషం. ‘ధ్రువ్ నాకు మంచి మిత్రుడు. మేజర్ ఈవెంట్ ఫైనల్లో స్నేహితుడితో తలపడటం కాస్త కష్టమైన విషయం. అతడికి మన ఆట గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. స్నూకర్ పరాజయాల తర్వాత ఈ టైటిల్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పదకొండో సారి జాతీయ బిలియర్డ్స్ టైటిల్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది’అని మ్యాచ్ అనంతరం పంకజ్ పేర్కొన్నాడు.