పందేనికి కోళ్లు సై అంటున్నాయి. పందెం రాయుళ్లు కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఆహారాన్ని అందిస్తూ సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తెలంగాణలో కోడి పందేలను నిషేధించడంతో ఖమ్మం జిల్లా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా పందేలు నిర్వహించేందుకు పెద్దఎత్తున మినీ స్టేడియాలను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లు, ప్లడ్‌లైట్లు, బారికేడ్ల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, సంక్రాంతి పండుగ మూడురోజుల్లో కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.
సత్తుపల్లి, జనవరి 7 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పందెంరాయుళ్లు తమ కోడిపుంజులను రెడీ చేస్తున్నారు. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పందేల కోసం ఉవ్విళ్లూతున్నారు. సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది కోడిపందేలు, బోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నలు, హరిదాసు కీర్తనలు. పండుగ రోజుల్లో పల్లెల్లో కోడిపందేల జోరు అంతాఇంతా కాదు. ఏడాది ముందు నుంచే పందేల కోసం తమ కోళ్లకు శిక్షణనిస్తుంటారు.
పందెంకోళ్లకు మిలటరీ స్థాయిలో పెంపకందారులు శిక్షణ ఇస్తారు. ఉదయం ఐదు గంటలకు కోడిపుంజులను బైటకు తీసి కాసేపు చల్లటి గాలి, శ్వాస తీసుకునేలాగా చుట్టువలయంగా నెట్ ఏర్పాటు చేసి అందులో వదిలిపెట్టి పరుగెత్తిస్తారు. అనంతరం స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు అలసిపోయిన తర్వాత పాలల్లో నానబెట్టిన బాదం, పిస్తా, ఖర్జూర, కిస్మిస్లు, మటన్ ఖైమా తినిపిస్తారు. అనంతరం గుడ్డులోని తెల్లసోనను పుంజుకు తాగిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు పుంజును బట్టి రూ.100 నుంచి 250 వరకు ఖర్చు చేస్తారు. పందెంకోళ్లను తయారు చేయడంలో వారు తీసుకునే శ్రద్ధ చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. కోడిపుంజులు పందెంలో అన్నిరకాల పోటీల్లో తట్టుకునేలా బలిష్టంగా తయారుచేస్తారు.
కోడిపందెల్లో నెగ్గేందుకు ముహూర్తాలు కూడా చూసుకుంటారు. ఏ కోడి ఏ రోజు పందెంలో పాల్గొంటే విజయం సాధిస్తారో ఆ కోడిని పందెంలో దింపుతారు. మనుష్యులకు పంచాంగ శాస్త్రం ఉన్నట్లే కోళ్లకు కూడా ప్రత్యేక పంచాంగశాస్త్రం ఉంది. దానినే కుక్కుటశాస్త్రం అంటారు. పందెంరాయుళ్లకు ఈ కుక్కుటశాస్త్రం ఆయుధం లాంటిది. యుద్ధానికి భగవద్గీత లాగా కోళ్లపందెలకు కుక్కుట శాస్త్రం అని చెప్పవచ్చు. కోడిని సంస్కృతంలో కుక్కుటం అంటారు. అలా ఈ పంచాంగానికి కుక్కుటశాస్త్రం అని పేరు వచ్చింది. కుక్కటశాస్త్రంలో పెంపకం, వాటి రంగులు, వర్గీకరణ, ఏ సమయంలో పందెం కాయాలి, నక్షత్రం లాంటి ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి.. ఈ నక్షత్రాల ప్రకారం పందెంరాయుళ్లు ఆయా సమయాలను బట్టి పందెలను కాస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కోడిపందేలను నిషేధించడంతో ఖమ్మంజిల్లా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల పందెంరాయుళ్లు భారీగా పందేలు నిర్వహించేందుకు పెద్దఎత్తున మినీ స్టేడియాలను తపించే విధంగా పందెంబరులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్లు సంప్రదాయ క్రీడ పేరుతో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లు, ప్లడ్‌లైట్లు, బారికేడ్ల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. కోర్టులు ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కోడిపందేలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే పందెంప్రియుల కోసం కోడిపందెలను వీక్షించే విధంగా బరులు ఏర్పాటు చేసి పార్కింగ్‌లకు కూడా స్థలాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన భీమవరం, ఏలూరు, సీతానగరం, కృష్ణా జిల్లా కాకర్ల, జనార్ధనవరం, మల్లేశ్వరం, గుడివాడ తదితర ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ మూడురోజుల్లో కోట్లలో పందేల రూపంలో చేతులు మారనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏపీని అనుకున్న సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పందెం రాయుళ్లు ఏపీకి తరలనున్నారు.
కల్లూరు/ వేంసూరు, జనవరి 7 : సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తీసుకుంటామని కల్లూరు రూరల్ సీఐ హనోక్ హెచ్చరించారు. శనివారం కల్లూరు, వేంసూరు పోలీసుస్టేషన్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కోడిపందాలు, పేకాట ఆడేందుకు ఎవరైతే స్థలం ఇస్తారో వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, నిర్వాహకులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. కల్లూరు రూరల్ ఎస్సై కొండల్రావు, ఏఎస్సైలు చారి, పుల్లారావు, వేంసూరులో ఎస్సై సురేశ్ పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, జనవరి 7: గ్రామాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై విజయ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె మాట్లాడారు. శుక్రవారం రాత్రి 11 మంది కోడి పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసి, రూ. 5,500 నగదు, 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సెల్ : 9440904244కు ఫోన్‌చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పందెలకు రెడీ చేసే కోడిపుంజుల్లో చాలా రకాలున్నాయి. గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకిడేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, సీతువా, గాజు కొక్కెరాయి, అబ్రాస్ ఉంటాయి. ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. పందెంలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారంతోపాటు ప్రత్యేకమైన శిక్షకులచే శిక్షణనిస్తారు.