e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన

కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు. కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలను వంశీ ఆర్ట్స్ థియేటర్ రూపొందించిన ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పంచసూత్రాలను ఉప రాష్ట్రపతి ప్రతిపాదించారు.

పంచ సూత్రాలు

  • కొవిడ్ ఎదుర్కొనే దిశలో శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవసరం అన్నారు. చైతన్యరహిత జీవన విధానం కారణంగా కొత్త సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామం, నడక, యోగ లాంటి వాటికిరోజూ కొంత సమయం కేటాయించాలని సూచించారు.
  • మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, మానసిక సంతులనానికి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ఉప రాష్ట్రపతి సూచించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
  • అత్యంత కీలకమైన అంశంగా భారతీయ ఆహారపు అలవాట్లను ఆయన ప్రస్తావించారు. మన దేశంలోని వాతావరణ మార్పులకు అనుగుణంగా మన పెద్దలు ఆహారాన్ని సూచిస్తూ వచ్చారని.. వ్యర్థమైన జంక్‌ఫుడ్‌పై కాకుండా సంతులన, పోషకాహారం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు.
  • వ్యక్తిగత పరిశుభ్రత, జాగ్రత్తలు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్ లను ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. టీకా వేయించుకోవడం తప్పనిసరి అని, ఆ తర్వాత కూడా మాస్క్ ధరించడంతోపాటు సురక్షిత దూరాన్ని పాటిస్తూనే ఉండాలన్నారు.
  • ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో మమేకమై జీవించడంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఏసీ గదుల్లో కాకుండా.. వీలైనంత ఎక్కువగా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ఐదు అంశాలను పాటిస్తూనే భయాన్ని వీడి ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేసే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించిన ఆయన, జాగ్రత్త పడడమే తప్ప, పుకార్లు, భయాలతో ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
- Advertisement -

‘వసుధైక కుటుంకం’ స్ఫూర్తిని చాటిచెప్పాం
అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న అనేక దేశాలు కరోనా బారిన పడి విలవిల్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ ప్రారంభంలో ఆందోళనకు గురయినా.. వెంటనే తేరుకుని ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ మహమ్మారితో పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉందన్నారు. మన శాస్త్రవేత్తలు, పరిశోధనకారుల కృషితో టీకాను తయారు చేసి మన ప్రజలకే కాకుండా, విదేశాలకు సైతం అందిస్తూ.. మన జీవన విధానమైన ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకాకారణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే విధంగా చొరవతీసుకోవాలని యువతకు ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజల్లో టీకాకరణపై ఉన్న అపోహలను తొలగించడం ద్వారా టీకాకరణను ఓ ప్రజాఉద్యమంగా రూపుదిద్దడంలో ప్రతి భారతీయుడు తనవంతు బాధ్యతను పోషించాలన్నారు.

బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో మైలురాయి
కరోనా కొత్త కథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉప రాష్ట్రపతి అభినందించారు. కొత్త అనుభవాల నుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గానగంధర్వుడు బాలసుబ్రమణ్యంకు అంకితమివవ్వడాన్ని, ముఖచిత్రంగా ఎస్పీబీ చిత్రాన్ని ప్రచురించడంపై ఉప రాష్ట్రపతి.. పుస్తక ప్రచురణకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. బాలసుబ్రమణ్యం జీవితం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్న ఆయన, తెలుగు సంగీతానికి ఘంటసాల, బాలు ద్వయం స్వర్ణయుగం తీసుకొచ్చారని గుర్తుచేశారు. వీరిద్దరూ తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి, ప్రేక్షక హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారన్నారు. ఐదున్నర దశాబ్దాలపాటు తన గానామృతంతో సంగీతాభిమానులను అలరించిన బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అత్యంత విచారకరమన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వేదిక ద్వారా మరోసారి బాలు స్మృతికి నివాళులు అర్పించారు.

పోరంకి దక్షిణామూర్తి, కాళీపట్నం రామారావుకు నివాళి
జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ అన్న పోరంకి దక్షిణామూర్తి మాటలను ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి గుర్తు చేశారు. ఎన్నో మంచి కథలను తెలుగు వారికి మరింత చేరువ చేసేందుకు ప్రయత్నం చేసిన కాళీపట్నం రామారావును స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది జూన్ 4న కాళీపట్నం రామారావు, అంతకు ముందు ఫిబ్రవరి 6న పోరంకి దక్షిణామూర్తి పరమపదించగా.. ఉప రాష్ట్రపతి వారిద్దరి స్మృతికి వేదికపై నుంచి నివాళులర్పించారు.

మాతృభాష మాధుర్యాన్ని కాపాడుకునేందుకు పంచసూత్ర ప్రణాళిక
మాతృభాష మాధుర్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి భారతీయుడు తమ మాతృభాషలను కాపాడుకునేందుకు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా సూత్ర ప్రణాళికను ప్రతిపాదించారు. ఇందులో మొదటిది వీటిలో మొదటిది ‘ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడడం. రెండోది పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం. మూడోది న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగాలి. తీర్పులు తల్లిభాషలోనే ఇవ్వాలి. నాల్గోది ఉన్నత విద్య, సాంకేతిక విద్యల్లో స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెరగాలి. ఐదో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లల్లో.. తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని సూచించారు.

ప్రవాసీయులకు అభినందన
అమెరికాలో నివసిస్తున్నప్పటికీ అమ్మభాషను మరచిపోకుండా మాతృభూమితో మమేకమవుతూ ఈ కొత్త కథలు పుస్తకంలో తెలుగు కథలతో ఆకట్టుకున్న ప్రవాసాంధ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించి, వాటిని అక్షరబద్ధం చేసి ముందుతరాలను ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో ఏపీ శాసన మండలి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, అమెరికాకు చెందిన గుండె వైద్య నిపుణులు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు, ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, భువనచంద్ర పాల్గొన్నారు. అమెరికా నుంచి వంగూరి ఫౌండేషన్ అధినేత డాక్టర్ చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ కిషోర్ బాబు కేశాని, గాన కోకిల శారద ఆకునూరి, సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, రాధికా మంగిపూడి, సిడ్నీ నుంచి శ్రీమతి విజయ గొల్లపూడి, లండన్ నుంచి నవతా తిరునగరి, ఒమన్ నుంచి డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి, కెనడా నుంచి సరోజ కొమరవోలు, చెన్నై నుంచి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సీఎంకే రెడ్డి, హైదరాబాద్ నుంచి జేవీ పబ్లికేషన్ శ్రీమతి జ్యోతి వాల్లభోజుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రచయితలు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. సింగపూర్ నుంచి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement