RajTarun | టాలీవుడ్లో వరుసగా పరాజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ నుండి విడుదలైన తాజా చిత్రం ‘పాంచ్ మినార్’. ఈ సినిమా ఎలా ఉంది? మొదటి మూడు సినిమాలతో స్టార్డమ్ అందుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ సినిమాతోనైనా కోరుకున్న విజయాన్ని అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ
‘పాంచ్ మినార్’ కథాంశం పూర్తిగా కొత్తది కాదు, అలాగని రొటీన్ కాదు. ఈజీ మనీ కోసం ప్రయత్నించే హీరో ఒక సమస్య నుంచి తప్పించుకోడానికి ఇంకొక పెద్ద సమస్యలో పడితే ఎలా ఉంటుంది అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి. దర్శకుడు రమేష్ కడుముల మొదట్లో చిన్న పొరపాటు చేశారు. సన్నివేశాలు కొత్తగా ఉన్నా, వాటిని అడ్డుకునే విధంగా వచ్చిన పాటలు రొటీన్‌గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో ఈ పాటలు ప్రేక్షకులను కథ నుంచి డిస్కనెక్ట్ చేశాయి. అయితే, రెండో సగంలో రమేష్ కడుముల ఆ మిస్టేక్‌ను సరిదిద్దుకుని, హాస్యం మరియు కొత్త పాయింట్లను కలగలిపి ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేశారు.
నటీనటుల ప్రదర్శన:
‘కిట్టు’ పాత్రలో రాజ్ తరుణ్ చాలా కొత్తగా కనిపించాడు. సమస్యల్లో చిక్కుకున్న మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో తన నటన పర్ఫెక్ట్గా ఆకట్టుకుంది. ఈ పాత్ర రాజ్ తరుణ్‌కు మంచి కంబ్యాక్ అవుతుందనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సిట్యువేషనల్ కామెడీ బాగా పండింది. ముఖ్యంగా, అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద బలం. నవ్వులు తగ్గుతున్నాయి అనుకున్న ప్రతిసారీ, ఆయన తన ప్రదర్శనతో మళ్లీ నవ్వులు తెప్పించాడు. హీరోయిన్ రాశి సింగ్ తన పాత్ర పరిధిలో బాగానే చేసింది. ఫాదర్ రోల్లో బ్రహ్మాజీ నటన ఆకట్టుకుంది. సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి వంటి నటులు కూడా తమ కామెడీ టైమింగ్‌తో మెప్పించారు.
చివరిగా రాజ్ తరుణ్‌కు ఇది ఖచ్చితంగా కావాల్సిన విజయం. కేవలం యూత్‌ను దృష్టిలో ఉంచుకోకుండా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటూనే, మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను మెయింటైన్ చేశారు. చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ అభిమానులు రిలాక్స్ అయ్యే అవకాశం ఈ సినిమాతో దక్కింది.
రేటింగ్: 3 / 5