తెలంగాణ గ్రామీణ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘పళ్లబురుసు’. ‘బలగం’ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రధారులు. ఉదయ్‌చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం టీజర్‌ను హీరో నాగచైతన్య విడుదల చేశారు. వేపపుల్లతో పళ్లు తోముకుంటూ పొలాల వెంట నడుస్తూ పోతున్న పెద్దాయన సుధాకర్ రెడ్డిని చూసి గ్రామ యువకులు ‘తాత.. ఇంకా పళ్లబురుసు తీయలే’ అని అడగటం, మరో యువకుడు ‘ఏం తాత.. మళ్ల యాప బురుసు పెట్టివవ్..’ అంటూ ఆటపట్టించే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.
పల్లెటూరి మనుషులు, అక్కడి వాతావరణం, విచిత్రమైన పాత్రలతో ఆకట్టుకుంది. తెలంగాణ పల్లె నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ ఇదని, ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.