Imran Khan : పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Former PM), పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను జైల్లో చంపేశారంటూ సోషల్ మీడియా (Social Media) లో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని స్పష్టంచేశారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు.
అంతకుముందు ఈ వదంతులపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, ఇమ్రాన్‌తో ఆయన కుటుంబసభ్యుల భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. గత కొన్ని వారాల నుంచి ఇమ్రాన్ సోదరిలు ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతించడంలేదు. దాంతో వారికి ఆయన మరణవార్త ఆందోళన కలిగించింది.
దాంతో ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నూరీన్ ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం అడియాలా జైలు బయట గంటల తరబడి నిరసన చేపట్టారు. లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసని, బహుశా ఇమ్రాన్‌ను వేరేచోటుకు తరలించి ఉండవచ్చునని, అందుకే మమ్మల్ని కలవనివ్వడం లేదోమోనని అలీమా ఖాన్ అనుమానం వ్యక్తంచేశారు. దేశంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.
2022లో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయారు. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన ప్రభుత్వం ఆయనపై అవినీతి, ఉగ్రవాదం వంటి పలు కేసులే పెట్టింది. ఈ కేసులలో ఆయన 2023 ఆగస్టు నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు.