Pakistan : పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఒక పోలీస్ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులకు మరణించారు. మరో ముగ్గురికిపైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ పోలీస్ చెక్‌పోస్టు వద్దకు పేలుడు పదార్థాలతో కూడిన ఒక వాహనం శనివారం రాత్రి దూసుకొచ్చింది. ఆ వెంటనే పేలుడు జరిగింది. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది పోలీసులు మరణించారు.
వాహనంలో పేలుడు పదార్థాలు భారీగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది పోలీసులు చాలా దూరం ఎగిరిపడ్డారు. కొందరు పోలీసులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి మృతదేహాల్ని బయటకు తీశారు. ఈ ఘటనతో అక్కడి నిర్మానం పూర్తిగా కూలిపోయింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక డీఐజీ సజ్జాద్ ఖాన్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడిలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల చాలా దూరం వరకు నివాసాలు, ఇతర బిల్డింగులు కూడా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని చోట్ల పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పులు కూడా కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతుండగా, ఉగ్రవాదులు మళ్లీ దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసుల్ని మోహరించినట్లు చెప్పారు. ఈ ఘటనను స్థానిక నేతలు ఖండించారు. మరోవైపు తాము పది చోట్ల దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థ ప్రకటించుకుంది.