Baloch Woman : బలూచ్ రెబెల్ గ్రూప్ అయిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA).. గత వారాంతంలో పాకిస్థాన్ (Pakistan) లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan Province) లో తమ ఆత్మాహుతి దళం చేసిన భీకర దాడులకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. మొత్తం మహిళలతో కూడిన ఆత్మాహుతి దళమే ఈ దాడులకు పాల్పడింది. ఈ మధ్యకాలంలో ఇంతపెద్ద ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఈ వీడియో క్లిప్‌లో గ్వదర్ ఫ్రంట్ దగ్గర ఆపరేషన్ హెరాఫ్లో భాగంగా హవా బలూచ్ అనే ఆత్మాహుతి దళ సభ్యురాలు కాల్పులు జరుపుతూ కనిపించింది.
ఆపరేషన్ హెరాఫ్లో ఆత్మాహుతి దళ సభ్యురాలు హవా బలూచ్ నిస్వార్థంగా పోరాడింది. తోటి ఆత్మాహుతి దళసభ్యులతో భుజంభుజం కలిపి శత్రువుపై యుద్ధం చేసింది. ఇది ఆమె మరణానికి 12 గంటల ముందు ఇచ్చిన ఆఖరి సందేశం అని రెబెల్ గ్రూప్ ఆ వీడియోతో టెక్ట్స్‌ను జతచేసింది. ‘బలూచ్ దేశం ఇప్పుడు శత్రుసేనలతో పోరాడుతోంది. మీరు కూడా మాతో కలిసి రండి. మనకు ఇంతకంటే మరో మార్గం మిగిలి లేదు’ అనే సందేశాన్ని హవా బలూచ్ తన మొబైల్ కెమెరాలో రికార్డు చేశారు.
‘భయం లేకుండా మన ముందుకు వచ్చే సత్తా పాకిస్థాన్‌కు లేదు. పాకిస్థాన్ మనల్ని ఎదిరించలేదు. ఈరోజు సంతోషకరమైన రోజు. ఈరోజు మనం శత్రువును ఎదిరిస్తున్నాం. బలూచ్ తల్లులు, సోదరీమణులు భయపడే రకం కాదని ఇవాళ మనం శత్రువుకు రుజువు చేస్తున్నాం’ అని హవా బలూచ్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ వీడియోలో మరో ఆత్మాహుతి దళ సభ్యురాలు హవా బలూచ్‌ను ‘యుద్ధం ఎలా ఉంది..?’ అని ప్రశ్నించగా.. నవ్వుతూ ‘యుద్ధం సరదాగా ఉంది’ అని బదులిచ్చింది. ‘ఇవాళ మనం శత్రువు కోసం వేచి ఉన్నాం. శత్రువులు ఇక్కడే ఉన్నారు. వాళ్లు పిరికివాళ్లు. చాటుకు నక్కి కాల్పులు జరుపుతున్నారు. మన ముందుకు వచ్చే ధైర్యం వాళ్లకు లేదు. రండి, రండి, ఈరోజు మేం మీ కోసం ఎదురుచూస్తున్నాం. మీరు ఈ రోజు బలూచ్ మహిళా స్వాతంత్య్ర సమరయోధులను ఎదుర్కొంటున్నారు. బలూచ్ మహిళలతో పోరాటం ఎంత కష్టమో ఈరోజు మీకు తెలిసొస్తుంది’ అని హవా బలూచ్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
‘బలూచ్ దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది. బలూచ్ పోరాటయోధులతో మనం భుజం కలుపాలి. శత్రువు ఇక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే. వారి బలం సన్నగిల్లింది. శత్రువుతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తించాలి. చూడండి.. ఈరోజు మన పోరాటయోధులు ఆత్మబలిదానం ఇస్తున్నారు. వాళ్లను వాళ్లు ముక్కలు చేసుకుంటున్నారు. అయినా కొందరు డబ్బుల కోసం శత్రువులకు గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు’ అంటూ బలూచ్ ప్రజలకు ఆ వీడియోలో హవా బలూచ్ సందేశం ఇచ్చారు.
ఈ వీడియో సందేశానికి చివరలో హవా బలూచ్ నేలకొరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను బలూచ్ రెబెల్ గ్రూప్ జతచేసింది. తోటి ఆత్మాహుతి దళసభ్యురాల్లో కలిపి ఆమె రక్తపుమడుగులో పడి ఉన్నారు.