జూరాల నీళ్లడిగితే రైతులకు సంకెళ్లా?
జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద పొట్ట మీదున్న వేలాది ఎకరాల వరి పంటను కాపాడేందుకు కొందరు రైతులు సాహసించి సెప్టెంబర్ 19న లెఫ్ట్ మెయిన్ కెనాల్ గేట్లు తెరిచారు.
ఆ క్రమంలో తోపులాట, గొడవ జరిగింది. అయితే ఆ అన్నదాతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఇరిగేషన్ అధికారులు అమరచింత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే 14 మంది రైతులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు వారి ఇండ్లపై పోలీసుల నిఘా ఉన్నది. ఏ క్షణాన అయినా వారిని అరెస్టు చేసి జైలుపాలు చేయొచ్చు. వారిపై భారత న్యాయ సంహితలోని పదికి పైగా సెక్షన్లను మోపారు.
జూరాల నీటి విడుదల సందర్భంగా రైతులెవరూ ఆఫీసులోకి చొరబడి అధికారుల విధులకు ఆటంకం కలిగించలేదు. ఎవరిపైనా భౌతిక దాడులకు పాల్పడలేదు. అంతకుముందే ఎండిపోతున్న పంటలకు నీరు ఇవ్వండి అంటూ ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగారు. ఎన్ని రోజులైనా అధికారులు పంటల వైపు రాలేదు. ఫోన్లు చేసినా బదులు ఇవ్వలేదు. ఏ దారీలేని రైతులు చివరకు ప్రాజెక్టు వద్ద నిరసనలు చేపట్టారు. వారిని శాంతింపజేసే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరుగలేదు. నీరు విడుదల చేసే ప్రసక్తే లేదని మంత్రులు ప్రకటించారు. పది రోజుల ఆందోళన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కడుపుమండిన రైతులు స్వయంగా నీళ్లు విడుదల చేసుకున్నారు. ఇందులో రైతుల పరిస్థితిని అర్థం చేసుకోని, వారి ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వానిదే నేరం.
ఇది కేవలం కేసుల పాలైన 14 మంది రైతుల ఆగ్రహం మాత్రమే కాదు, బాధిత రైతులు లక్షల్లో ఉన్నారు. వర్షాలు లేని కారణంగా అందరి కన్నా ఎక్కువగా నష్టపోయేది రైతులే. వారి దుస్థితిని సానుభూతితో అర్థం చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. పంటల నష్టం, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేని రైతులు మరిన్ని రూపాల్లో కూడా తమ ఆందోళనలను ప్రకటించవచ్చు. అందరిపై కేసులు పెడుతూ పోతే ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. రైతులు పండించేది వారి ఒక్కరి కడుపు నింపుకోవడానికి కాదు. సమాజంలోని అందరి ఆకలి చల్లార్చేది అన్నదాతలే. పంటలను కాపాడేందుకు వారు స్వయంగా నీళ్లు విడుదల చేసుకున్నది కూడా అందుకే.
ఆ రైతులు నీళ్లు విడుదల చేసే సాహసం చేయకపోయి ఉంటే మంత్రులు హడావుడిగా సెప్టెంబర్ 24న బెంగుళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి జూరాలకు నీళ్లు వదలాలని కోరేవారే కాదు. ఇది ఆ రైతులు కేసులు మోస్తూ సాధించిన విజయం కాదా? నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి విడతలవారీగా 3 టీఎంసీల నీళ్లు అందిస్తామన్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మాట చెల్లుబాటు కాలేదు. సెప్టెంబర్ చివరి వారంలో కర్ణాటకలో పడిన వర్షాల ద్వారా వచ్చిన నీరు మాత్రమే జూరాల చేరింది.
ఆ తర్వాత ఆగిపోయింది. నారాయణపూర్, ఆల్మట్టి డ్యామ్లలో సమృద్ధిగా నీళ్లున్నాయి, వారబందీ లెక్కన పది రోజుల పాటు మనకు నీళ్లందుతాయి. రెండు రోజుల్లో జూరాలకు చేరుతాయి అని ప్రకటించిన అధికారుల మాట తేలిపోయింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం ఫలించలేదు. జూరాల ఆయకట్టు కింది చివరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లు ఇస్తామని మాట తప్పిన కర్ణాటకలో ఉన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పాలకులకు లేదా? రైతులను బలి చేయడం న్యాయమా?
– బద్రి నర్సన్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

