ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది. ఆరాధనా ప్రక్రియల్లో పండుగ రూపంలో కొలిచే బతుకమ్మ ప్రధానమైనదే కాదు, అందమైనది, ఆకర్షణీయమైనది, సువాసనాభరితమైనది, సులభమైనది, సామూహికమైనది, సార్వత్రికమైనది. సాధారణంగా పూజలో పూలకు ప్రాధాన్యతనిస్తాం. కానీ, తెలంగాణలో ఆ పూలనే భగవత్స్వరూపంగా పూజించడం విలక్షణ సంస్కృతికి నిదర్శనం. అసలు బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకొంటారో తెలిపే కథలు పురాణాలలో, చరిత్రలో, జానపదులలో చాలా ప్రచారంలో ఉన్నాయి.
బతుకమ్మ పండుగను తెలిపే పురాణ కథలు, చారిత్రక, జానపద కథలు చాలా ఉన్నా యి. సామాజికంగా ప్రచారంలోఉన్న కథ ఏమిటంటే భూస్వాముల అరాచకాలు మితిమీరి నప్పుడు ఆడపిల్లలు తమ మానరక్షణ కోసం ఆత్మహత్యలు చేసుకునేవారు. వారి తల్లిదండ్రులకు ఎంతో కడుపుకోత మిగిలేది. ఈ అరాచకాలు పోయి ఆడపిల్లలందరూ బతకాలి అని వారికి గుర్తుగా ‘బతుకమ్మ’ పండుగను జరుపుకునేవారన్నది ఒక కథ. ఇలా కథనాలు, కారణాలు ఏవైనా పండుగ మాత్రం అందరిదీ.
ప్రకృతికి మరో రూపమే శక్తి. ఆ శక్తిని మనం స్త్రీమూర్తిగా ఆరాధిస్తాం. అనాదిగా ఆదిశక్తిగా పూజిస్తున్నాం. శక్తి లేని సృష్టి జీవం లేని శరీరం వంటిది. అందుకే నిరంతరం అనేక ప్రక్రియల్లో ప్రకృతి శక్తిని తద్వారా ప్రాణశక్తిని పునరుత్తేజితం చేస్తూ ఉంటాం. క్రియావిధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ అంతిమలక్ష్యం జీవిత పరమార్థాన్ని గ్రహించి సత్ఫలితాలను పొందటమే.
శక్తి ఆరాధన చేసే వారిని శిష్టులు, జానపదులు అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. ప్రథమ
వర్గం వారు శక్తిని శ్రీచక్రంగా ఆరాధిస్తే, జానపదులు బతుకమ్మగా కొలుస్తారు. శిష్ట వ్యావహారిక ఉపాసనకు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి పాటించ వీలుకాని వారు ఆ పరిస్థితుల్లో శ్రీచక్రంలోని త్రికోణాన్ని పోలిన బతుకమ్మను పూజిస్తారు. బతుకమ్మకు, శ్రీచక్రానికి, త్రికోణాకృతికి, మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉన్నది. మానవదేహమే శ్రీచక్రం. పరమేశ్వరుడు పార్వతీదేవీతో శ్రీచక్రం గురించి వివరిస్తూ ‘ఓ పరమేశ్వరీ! శ్రీచక్రం అంటే ఒక చిన్నయంత్రం కాదు. అది సమస్త బ్రహ్మాండానికి ప్రతీక’ అన్నాడు.
శక్తి రెండు రకాలు. ఒకటి స్థితిశక్తి, రెండు గతిశక్తి. మానవ దేహంలో ఏడు శక్తి స్థానాలున్నాయి. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు శక్తిని ప్రసరింపచేస్తా యి. శరీరంలోని ప్రాణశక్తి గతిశక్తి. వెన్నుపాము దగ్గర మూలాధారంలో పాములా చుట్టచుట్టుకొని నిద్రాణస్థితిలో దాగి ఉండేది కుండలినీ శక్తి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ అత్యున్నత స్థితినే సమాధి స్థితి అంటారు.
షట్చక్రాల్లో మొదటిది మూలాధారం. మానవ దేహంలోని భౌతికశక్తిని నియంత్రించేది మూలాధార చక్రమే. బతుకమ్మ త్రికోణాకృతి తత్తాన్ని తెలుసుకొని పూజించటమంటే మనిషి తనను తాను గౌరవించుకోవటమే. బొడ్డెమ్మను మూలాధారంగా ప్రారంభించి సద్దుల బతుకమ్మతో సహస్రార చక్రాన్ని చేరిన అనుభూతితో 9 రోజులపాటు అమ్మవారి అనుగ్రహాన్ని, శక్తినీ, ముక్తినీ మనం పొందుతాం. శ్రీచక్రం అ యినా, బతుకమ్మ అయినా ప్రకృతికి అనుగుణంగా మానవదేహాన్ని సంసిద్ధం చేస్తూ క్రమబద్ధీకరించే ప్రక్రియలే. బతుకు సార్థకతను నేర్పేదే బతుకమ్మ.
డాక్టర్ కేడీడీ మృణాళిని
(అక్షరయాన్ సౌజన్యంతో..)