వినాయక్‌ను నేను మొదటిసారి కలిసింది దాదాపు నలభై ఏండ్ల క్రితం. అప్పట్లో మేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమంపై పనిచేస్తున్న బృందంతో పరస్పర చర్చలు జరుపడం మా ప్రయాణ ఉద్దేశం. ఈ ప్రక్రియలో, రాష్ట్రంలో బోధనా విధానాల్లో మార్పు తీసుకురావడానికి ఒక వనరుల బృందాన్ని గుర్తించే ప్రయత్నం జరిగింది.
ఆ వర్క్‌షాప్‌లు దీర్ఘకాలం సాగాయి. మేం చర్చించిన విషయాలు చాలా సంక్లిష్టమైనవి. ఎందుకంటే అవి సాధారణంగా ప్రజలు నమ్మే భావాలకు విరుద్ధంగా ఉండేవి. విద్యార్థులు, జ్ఞానం, భాష, అభ్యాసాన్ని ప్రభావితం చేసే సామాజిక ప్రక్రియల గురించి మేం చర్చించాం. భాష, పిల్లలు భాషను ఎలా నేర్చుకుంటారు, చదవడం-రాయడం అంటే ఏమిటి వంటి అంశాలు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకుల్లో ఉన్న సంప్రదాయ దృక్కోణాలను మార్చే అవసరాన్ని సూచించాయి. మేం ఇటువంటి చర్చలను అనేక రాష్ర్టాల్లో నిర్వహించగా, వాటిలో కొంతమేర విజయం సాధించాం. ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. ఈ రాష్ట్రం రెండు ముఖ్యమైన విధాలుగా ప్రత్యేకంగా కనిపించింది.
మొదటిది: విద్యావ్యవస్థలోని నిరంతరత, దానికి విద్యావ్యవస్థ ఇచ్చిన అంతర్గత ప్రాముఖ్యత. రెండవది: ఈ ప్రయాణంలో మాతో కలిసి పనిచేసిన బృంద సభ్యుల నిజాయితీ, కృషి. పాఠ్యప్రణాళిక, బోధనా ప్రక్రియల రూపకల్పన నుంచి తరగతి గదిలో అమలు వరకు ఉపాధ్యాయులకు శిక్షణ, సహాయక పదార్థాల అభివృద్ధి ఇవన్నీ ఈ ప్రక్రియలో భాగమయ్యాయి. ఈ ప్రయాణంలో మేం అనేక నిబద్ధత గల వ్యక్తులను కలుసుకున్నాం. వారిలో కొందరు మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే వారు ఈ ఆలోచనలను తమవిగా స్వీకరించి, భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు వినాయక్ సువర్ణ.
ఒక సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ, అతనిలో ఆలోచనలను అర్థం చేసుకునే శక్తి, తన అభిప్రాయాలను వ్యక్తపరచే సామర్థ్యం, కొత్త ఆలోచనలను స్వాగతించే స్వభావం కనిపించాయి. వినాయక్ ఒక ప్రత్యేక వ్యక్తిగా మాకు కనిపించారు.
సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు రావడానికి ఇష్టపడని వారితో మృదువుగా, సహనంతో చర్చించేవారు. స్థానిక ఉదాహరణలు, భాషా ప్రయోగాల ద్వారా విషయాన్ని మరింత సమర్థంగా వివరించేవారు.
అసాధారణ ప్రతిభ వల్ల ఆయన ఆ తర్వాత జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఎంపికయ్యారు. ఎన్సీఈఆర్టీ విద్యా సంస్కరణలపై రూపొందించిన పత్రాల్లో కూడా ఆయన పాత్ర ఉన్నది.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా వినాయక్ కృషి అలాగే కొనసాగింది. ప్రధానంగా పిల్లల ఇంటి భాషను వాచక భాషగా మార్చి పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, భాషకు ఆయన జీవంపోశారు. పిల్లలు వారి భాషలోనే ఆలోచిస్తారు, వ్యక్తపరుస్తారు. దీనిని నమ్మిన వినాయక్ వాచకాల ద్వారా వాటిని సాకారం చేయడంలో కృతకృత్యులయ్యారు. సువర్ణ జూన్ 30న (నేడు) ఉద్యోగం నుంచి విరమణ పొందుతున్నప్పటికీ, తన లక్ష్యాన్ని కొనసాగించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆయన కృషి మరింతగా ముందుకు వెళ్లాలి.
– డా.హెచ్ కే దివాన్ (హార్డీ)
(వ్యాసకర్త రచయిత: అధ్యాపకుడు,
విద్యా భవన్ సొసైటీ, ఉదయ్‌పూర్ ).
అనువాదం: లోకే రాజ్ పవన్