ప్రీతమ్ అండ్ పెడ్రో
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: వీర్ హిరానీ, అర్షద్ వార్సీ, విక్రాంత్ మెస్సి, బొమన్ ఇరానీ, సంజయ్ దత్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు
దర్శకత్వం: అవినాష్ అరుణ్
బ్లూ వేల్ ఛాలెంజ్.. కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్లో తీవ్రమైన ఆందోళన సృష్టించిన ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పిల్లలను, యువతను లక్ష్యంగా చేసుకుని.. వికృత క్రీడ సాగించింది. ముఖ్యంగా మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పింది. అలాంటి ఆన్లైన్ గేమ్స్, పిల్లల విషయంలో తల్లిదండ్రుల అశ్రద్ధ లాంటి విషయాలను స్పృషిస్తూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రాసిన కథే.. ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’. జియో హాట్‌స్టార్ వేదికగా విడుదలై రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది.
నార్త్ గోవాలో ఒక ఏటీఎం చోరీతో కథ మొదలవుతుంది. ఈ కేసు అక్కడి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పెడ్రో (అర్షద్ వార్సీ) దగ్గరికి చేరుతుంది. మరోవైపు ప్రీతమ్ పార్కర్ (వీర్ హిరానీ) తన తాతయ్యతో కలిసి గోవాలోనే నివసిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మన్‌గా పనిచేస్తుంటాడు. తన తాతయ్య ప్రేమగా చూసుకునే పాత టేప్ రికార్డర్.. అందులో తన నానమ్మ పాడిన పాట క్యాసెట్ కనిపించకుండా పోతుంది. ఆ విషయమై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు ప్రీతమ్. అదే సమయంలో ఏటీఎం దొంగతనం కేసుపై బిజీగా ఉంటాడు పెడ్రో. టెక్ జీనియస్ అయిన ప్రీతమ్.. ఆ కేసు విషయంలో పెడ్రోకి సహకరించి దొంగలను పట్టిస్తాడు. అప్పటి నుంచి ప్రీతమ్‌తో స్నేహంగా ఉంటాడు పెడ్రో.
ఒక కేసు విషయంలో స్పోర్ట్స్ మినిస్టర్‌కి కోపాన్ని తెప్పించడంతో.. పెడ్రోను సైబర్ సెల్‌కి బదిలీ చేస్తారు. సైబర్ సెల్లో ఏ మాత్రం అనుభవం లేని పెడ్రో.. అక్కడ చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇలా ఉండగా.. ఒకరోజు స్పోర్ట్స్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్‌కి గురవుతాడు. రూ.ఐదు కోట్లు ఇస్తేనే బాబును వదిలేస్తానని కిడ్నాపర్ బెదిరిస్తాడు. ఈ కేసును ఛేదించి, మినిస్టర్ దగ్గర మార్కులు కొట్టేసి.. మళ్లీ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్లిపోవాలని అనుకుంటాడు పెడ్రో. ఈ విషయంలో తనకి సహకరించాలని ప్రీతమ్‌ను కోరతాడు. అలాచేస్తే తాతయ్య టేప్ రికార్డర్‌ను కనిపెడతానని మాటిస్తాడు. దాంతో ప్రీతమ్ కూడా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే కిడ్నాపర్ వెనుక ఒక జీనియస్ హ్యాకర్ మార్టిన్ (విక్రాంత్ మెస్సి) ఉన్నాడనే విషయాన్ని ప్రీతమ్ కనిపెడతాడు. అయితే, ప్రీతమ్‌ను..
‘కబీర్ సహాని’ అని, తన పాతపేరుతో పిలుస్తాడు మార్టిన్. దాంతో, ప్రీతమ్‌కు ఒక్కసారిగా తన గతం కళ్లముందు కదలాడుతుంది. అయితే, ప్రీతమ్ గతం ఏంటి? టెక్ జీనియస్ అయిన తను.. ఎందుకు వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్ముతుంటాడు? అసలు అతనికి మార్టిన్కి ఉన్న సంబంధం ఏంటి? ప్రీతమ్‌ని ఆత్మహత్య చేసుకునేలా మార్టిన్ ఎందుకు ట్రాప్ చేస్తాడు? ప్రీతమ్-పెడ్రో కలిసి మినిస్టర్ కొడుకు కిడ్నాప్‌ను ఎలా ఛేదిస్తారు? ఈక్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? అనేది తెలియాలంటే.. సిరీస్ చూడాల్సిందే!