హైదరాబాద్, జూన్ 20: హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బీ మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించింది.
అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణకు చెందిన న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎదురొంటున్న అన్యాయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధి బృందంలో ఉపాధ్యక్షుడు డీఎల్ పండు, కార్యదర్శులు పీ శ్రావణ్‌కుమార్‌గౌడ్, కే నిరంజన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి పీ కృష్ణకీర్తన, ఖజాంచీ బాలాజీ బానోత్ తదితరులు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం లోక్‌అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిషారమయ్యాయి. 353 లోక్‌అదాలత్‌లలో మొత్తం 6,43,430 కేసులు రాజీ మార్గంలో పరిషారమయ్యాయి. సుమారు రూ.122 కోట్ల మేర అవార్డులు ప్రకటించినట్టు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పంచాక్షరి వెల్లడించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్-ఇన్-చీఫ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు.