న్యూఢిల్లీ, నవంబర్ 1: కరోనా ఉద్ధృతి కారణంగా ఏడాదిన్నరగా ఇండ్ల నుంచే పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు.. మళ్లీ కార్యాలయాలకు రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇండీడ్‌తో కలిసి ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ను నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాలు ఆఫీస్ నుంచి పనిచేసేందుకు సమాన స్థాయిలో మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి నుంచి 50 శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరుచుకునే అవకాశాలున్నాయి. గ్రూప్‌లవారీగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చే వీలుందని నాస్కామ్ తెలిపింది. కాగా, మిడిల్ ఏజ్‌తో పోల్చితే 25 ఏండ్లకు లోపున్న ఉద్యోగులు, 40 ఏండ్లకు పైనున్న ఉద్యోగులు.. ఆఫీస్‌కు తిరిగి రావడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. మహిళా ఉద్యోగులు సైతం ఎప్పుడెప్పుడు ఆఫీస్‌కు వెళ్దామా అని చూస్తున్నట్లు నాస్కామ్ వెల్లడించింది.
ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత
కార్యాలయాలను తిరిగి తెరిచే క్రమంలో 81 శాతానికిపైగా సంస్థలు.. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతలకే తొలి ప్రాధాన్యతనిస్తున్నాయి. అలాగే 72 శాతం కంపెనీలు సగం సిబ్బందితోనే వచ్చే ఏడాది నుంచి ఆఫీసులను నడిపించాలని చూస్తున్నాయి. కొవిడ్-19 దృష్ట్యా పనిలో కొత్త విధానాలను తీసుకురావాలనీ యోచిస్తున్నాయి. ఇందులో భాగంగానే వారానికి మూడు రోజులు ఇంటి నుంచి, మూడు రోజులు ఆఫీస్ నుంచి ఉద్యోగుల చేత పని చేయించుకోవాలన్నదాన్ని 70 శాతానికిపైగా సంస్థలు పరిశీలిస్తున్నాయి.
‘క్రమంగా ఆఫీస్ వర్క్‌ను మళ్లీ ప్రారంభించాలని పరిశ్రమ చూస్తున్నది. ఆన్సైట్, ఆఫ్‌సైట్ లొకేషన్లలో ఉద్యోగులు పనిచేసేలా కంపెనీలు నిర్ణయాలు తీసుకునే వీలున్నది. ఏదిఏమైనా ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతలకే మెజారిటీ సంస్థలు తొలి ప్రాధాన్యతనిస్తున్నాయి’
-దేబ్జానీ ఘోష్, నాస్కామ్ అధ్యక్షురాలు
‘కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ప్రభావితమయ్యా యి. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. చాలామందిలో ఇక ఇంతేనన్న అభిప్రాయం ఉన్నది. అయితే అటు కంపెనీలు, ఇటు ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారిప్పుడు’
-శశి కుమార్, ఇండీడ్.కామ్ ఇండియా సేల్స్ హెడ్