జోగులాంబ గద్వాల : జూన్ 3 నుంచి 20 వరకు జరిగే భూ భారతి (Bhu Bharati) సదస్సులను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector BM Santosh ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల పై తహసీలార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలకు అవగాహన సదస్సు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్వోఆర్ మార్పులు- చేర్పులు, వారసత్వ భూములు, సాదా బైనామాలు, ఓఆర్సీ వంటి సేవలు సులభతరం అవుతుందని వివరించారు. జిల్లాలో ఇటిక్యాల మండలంలో భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నిర్వహించి,దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తహసీల్దార్లు గ్రామాల వారిగా షెడ్యూల్ రూపొందించి పంపాలని ఆదేశించారు. జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించి,ఆగస్టు 14కు ముందుగా అన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. భూ భారతి చట్టంతో తహసీల్దార్ స్థాయి నుంచే అప్పీల్‌కి అవకాశం ఉండటం వల్ల భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.