కొల్లాపూర్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Batti Vikramarka ) , మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కనీస వసతులు కల్పించకపోవడంతో అధికారులు , సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఉదయమే గ్రామాలకు చేరుకున్న అధికారులు, సిబ్బందికి టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా హోటళ్ల వద్ద పడిగాపులు కాయవలసి వచ్చింది.
కొల్లాపూర్ పట్టణంలో వర్చువల్ లో పాన్గల్ లో 220/132 కేవీ సబ్ స్టేషన్ , జమ్మాపూర్, మైలారం, వెన్నచర్ల, మర్రికల్, మచ్చుపల్లి, పస్పులలో 33/11కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్ పంపిణీ, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ , కొత్త రేషన్ కార్డుల పంపిణీ, బహిరంగ సభ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కొల్లాపూర్ పట్టణానికి వచ్చారు.
ఉదయం నుంచి డ్యూటీలో ఉన్న అధికారులకు, సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వివిధ మండలాల నుంచి వచ్చిన మహిళ పంచాయతీ కార్యదర్శులు సైతం మధ్యాహ్నం భోజనం కోసం హోటల్లో చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. డ్యూటీ కి వచ్చిన వారికి కనీసం మంచినీళ్లు వసతి కూడా కల్పించలేదని ఉద్యోగస్తులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల పర్యటన సందర్భంగా కాన్వాయ్ రూట్లలో చిరు వ్యాపారస్తుల సముదాయాలను మూసివేయించారు. బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో నివసించే వారిని సైతం వారి ఇళ్లకు వెళ్లకుండా కట్టడి చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.