న్యూఢిల్లీ, నవంబర్ 13: క్షిపణులతో కాదు.. లేజర్ కిరణాలతో శత్రు యుద్ధవిమానాలను నేలమట్టం చేస్తానంటున్నది ఇజ్రాయెల్. అందుకు తగ్గ అత్యాధునిక ఆయుధ వ్యవస్థను సమకూర్చుకొంటున్నది. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ ‘ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్'(ఐఏఐ) గురువారం ఒక కొత్త ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను ప్రకటించింది. యుద్ధ విమానాలు, నౌకలతో ప్రత్యర్థులు దాడి చేస్తే ఆ ముప్పును ఆటోమేటిక్‌గా పసిగట్టి అదే సమయంలో వాటిని పనిచేయకుండా చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీనిని స్కార్పియస్ ఆయుధ కుటుంబంగా పిలుస్తున్నారు. ఈ విప్లవాత్మక ఆయుధ వ్యవస్థలో డ్రోన్లను, ప్రత్యర్థుల యుద్ధ నౌకలను, రాడార్ వ్యవస్థలను పేల్చేయడానికి క్షిపణులను పంపడం లాంటిది ఉండదు. లేజర్ కిరణాలను పంపుతారు. అవి ప్రత్యర్థి యుద్ధ విమానాలు, నౌకల్లోని విద్యుదయస్కాంత వ్యవస్థల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. తద్వారా వాటిలోని రాడార్లు, సెన్సర్లు, నావిగేషన్‌ను పనిచేయకుండా అడ్డుకొంటాయి.
స్కార్పియస్ కుటుంబంగా పిలుస్తున్న ఈ ఆయుధ వ్యవస్థలకు వాటిని ఆపరేట్ చేసే ప్రదేశాన్ని బట్టి కొన్ని పేర్లు పెట్టారు.
స్కార్పియస్ జీ: నేలపై నుంచి లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ
స్కార్పియస్ ఎన్: నౌకాదళంలో లక్ష్యాల ఛేదనకు ఉపయోగించే వ్యవస్థ
స్కార్పియస్ పీ: గాలిలో నుంచి లక్ష్యాల ఛేదనకు
స్కార్పియస్ జే: సిగ్నల్స్ జామర్
స్కార్పియస్ టీ: శిక్షణకు. అక్టోబర్‌లోనే ఐఏఐ స్కార్పియస్ టీని ప్రదర్శించింది.