హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీచేసిన నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని, బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలు చేయాలనే లక్ష్యంతోనే ఆయుధాల చోరీకి పాల్పడినట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు. ఆయుధాల చోరీతో పాటు విక్రయాల కోసం ప్రధాన నిందితుడికి సహకరించిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ కేసు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 31న బొల్లారం 20వ బెటాలియన్, మద్రాస్ రెజిమెంట్‌లోని ఆయుధాగారంలో పెద్దఎత్తున ఆయుధాలు చోరీకి గురైనట్టు ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిటర్ ఫిర్యాదు చేశారు. బొల్లారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సాంకేతిక ఆధారాలతో సెప్టెంబర్ 11న ప్రధాన నిందితుడు ఉప్పుతొల్ల మల్లేశ్ అలియాస్ రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సాయినగర్‌లోని ఇంట్లో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 22న మల్లేశ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆయుధాల చోరీ వెనుక ఉన్న కుట్ర బయటపడినట్టు సీపీ వివరించారు.
మల్లేశ్ తన బంధువు మల్లికార్జున్, స్నేహితుడు నిరంజన్‌తో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా దోపిడీలు చేయాలని పథకం వేసినట్టు దర్యాప్తులో తేలింది. మల్లేశ్‌కు గతంలో పరిచయమున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన అవిడే అలియాస్ ఓబీ, బీర్బల్షాను సంప్రదించి సైనిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి విక్రయించేందుకు ప్రయత్నించాడు. పిస్టల్‌కు రూ.3 లక్షలు, లాంగ్ వెపన్‌కు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని, మందుగుండు సామగ్రికి కూడా డబ్బులు ఇస్తామని ఓబీ అంగీకరించినట్టు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
ఆయుధాలను చోరీ చేసేందుకు మల్లేశ్ తనకు గతంలో పరిచయమున్న మద్రాస్ రెజిమెంట్ సిబ్బంది శేషు, వినోద్‌కుమార్, ప్రవీణ్ సహాయం తీసుకున్నాడు. నిందితుడికి సహకరించిన రెజిమెంట్ సిబ్బందితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిడే , బీర్బల్‌షా, నాగర్‌కర్నూల్‌కు చెందిన ఉప్పుతొల్ల మల్లికార్జున్, చెమ్మకర్ నిరంజన్ను రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. నిందితుల నుంచి 4 ఏకే-203 రైఫిళ్లు, 8 మ్యాగజైన్లు, ఇన్సాస్ రైఫిల్, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, 1,156 పిస్టల్ బుల్లెట్లు, 720 ఏకే-203 బుల్లెట్లు, 36 ఇన్సాస్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022లో బారక్పూర్లో పనిచేస్తున్న సమయంలో కొనుగోలు చేసిన నాటు తుపాకీని కూడా మల్లేశ్ ఇంటి నుంచి సులు స్వాధీనం చేసుకున్నారు.