e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News బిట్‌కాయిన్‌ను గుర్తించం

బిట్‌కాయిన్‌ను గుర్తించం

  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 29: క్రిప్టోకరెన్సీగా చెలామణీ అవుతున్న బిట్‌కాయిన్‌ను దేశంలో కరెన్సీగా గుర్తించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విషయం తెలిపారు. అలాగే బిట్‌కాయిన్‌ లావాదేవీలకు సంబంధించిన గణంకాల్ని ప్రభుత్వం సేకరించలేదని చెప్పారు.2008లో కొంతమంది ప్రోగ్రామర్లు బిట్‌కాయిన్‌ను క్రిప్టోకరెన్సీగా, ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ సిస్టమ్‌గా ప్రవేశపెట్టారు. ఇన్వెస్టర్లు ఈ డిజిటల్‌ కరెన్సీని వస్తువులు, సేవల కొనుగోలుకు, డబ్బుగా మార్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు.

ఈ సమావేశాల్లో క్రిప్టో బిల్లు..
ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీపై ఒక బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తున్నది. కొన్ని మినహాయింపులతో అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించేందుకు ‘క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు 2021’ను ప్రభుత్వం సభ ముందు ఉంచనున్నది. క్రిప్టో టెక్నాలజీలను ప్రమోట్‌ చేసేందుకు, రిజర్వ్‌బ్యాంక్‌ అధికారిక డిజిటల్‌ కరెన్సీ జారీని అనుమతించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు.

- Advertisement -

క్రిప్టోపై కేంద్రానికి బొంబే హైకోర్టు ఆదేశాలు
క్రిప్టోకరెన్సీపై ప్రవేశపెట్టనున్న బిల్లు, ఈ అంశంపై తీసుకోబోయే తదుపరి చర్యల గురించి 2022 జనవరి 17న తమకు తెలియచేయాలంటూ బొంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌, వినియోగానికి సంబంధించి చట్టాలు రూపొందించేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు దీపాంకర్‌ దత్తా, ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన బెంచ్‌… చట్టాన్ని చేయాలంటూ పార్లమెంటును తాము ఆదేశించలేమని పేర్కొంది.

దేశంలోకి క్రిప్టో ఎక్సేంజ్‌ ‘కాయిన్‌స్టోర్‌’
సింగపూర్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ ఫ్యూచర్స్‌, స్పాట్‌ ట్రేడింగ్‌ ఎక్సేంజ్‌ అయిన ‘కాయిన్‌స్టోర్‌’ భారత్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మేరకు ఇక్కడి యూజర్ల కోసం వెబ్‌, యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రారంభించింది. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్‌, వీటిని బై లేదా సెల్‌ చేసేందుకు తమ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుందని, సరళతరమైన కేవైసీ వెరిఫికేషన్‌, 24/7 కస్టమర్‌ సపోర్ట్‌ లభిస్తుందని కాయిన్‌ స్టోర్‌ తెలిపింది. 50కి పైగా క్రిప్టోకరెన్సీల్లో కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా ట్రేడ్‌ చేయవచ్చంటూ ఈ స్టార్టప్‌ కంపెనీ సోమవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.ఇండియాలో కార్యకలాపాల్ని విస్తరించేక్రమంలో మార్కెటింగ్‌, సిబ్బంది నియామకం, స్థానిక మార్కెట్‌కు అనుగుణమైన క్రిప్టోకరెన్సీ ఉత్పత్తుల్ని, సర్వీసుల్ని అభివృద్ధిపర్చేందుకు 2 కోట్ల డాలర్లను (దాదాపు రూ. 150 కోట్లు) సంస్థ కేటాయించింది.బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో కార్యాలయాల్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో కాయిన్‌స్టోర్‌ ప్రకటన వెలువడటం గమనార్హం. తమ కస్టమర్లలో 20 శాతం ఇండియా నుంచే ఉన్నారని కాయిన్‌స్టోర్‌ సహ వ్యవస్థాపకుడు జెన్పిఫర్‌ లూ చెప్పారు.

ప్రభుత్వానికి ఆర్బీఐ ప్రతిపాదన
‘బ్యాంక్‌ నోట్‌’గా డిజిటల్‌ కరెన్సీ

డిజిటల్‌ రూపంలో ఉన్న కరెన్సీని (డిజిటల్‌ కరెన్సీ) ‘బ్యాంక్‌ నోట్‌’ నిర్వచనంలో చేర్చడానికి అనుగుణంగా ఆర్బీఐ చట్టం 1934కు సవరణ చేపట్టాలంటూ రిజర్వ్‌బ్యాంక్‌ ప్రతిపాదన తమకు అందిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు తెలిపారు. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ఎటువంటి అవాంతరాలు లేకుండా వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి అమలు చేయదగ్గ వ్యూహాలపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్నదని, ఈ క్రమంలో ‘బ్యాంక్‌ నోట్‌” నిర్వచనాన్ని విస్త్రతపర్చే ప్రతిపాదన ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి అందిందని మంత్రి వివరించారు. సీబీడీసీతో ఒనగూడే ప్రయోజనాల్ని మంత్రి వివరిస్తూ నగదుపై ఆధారపడటం తగ్గుతుందని, కనిష్ఠ లావాదేవీ వ్యయాల కారణంగా ప్రభుత్వానికి అధిక లబ్ది చేకూరుతుందన్నారు. అయితే ఈ కరెన్సీతో లభించే ప్రయోజనాలతో పోలిస్తే ఎదురయ్యే రిస్క్‌లను జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉందని పంకజ్‌ చౌదరి చెప్పారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement