
న్యూఢిల్లీ, జనవరి 31: ఏదైనా ఒక స్థలంపై ‘పవర్ ఆఫ్ అటార్నీ’(పీవోఏ) ఉన్న వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రిజిస్ట్రేషన్‌కు పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ కాపీ ఉన్నా సరిపోతుందని స్పష్టం చేసింది. పవర్ ఆఫ్ అటార్నీని మౌఖికంగా రద్దు చేయడం చట్టబద్ధంగా కుదరదని ఈ సందర్భంగా పేర్కొన్నది. సాధారణంగా విదేశాల్లో ఉండేవారు, ఆరోగ్యం బాగా లేనివారు పవర్ ఆఫ్ అటార్నీని నియమించుకొని, వారి ద్వారా స్థలాలను అమ్మాలనుకొంటారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు వీరిపై చాలా ప్రభావం చూపనున్నది.
యజమానికి తెలియకుండా
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యజమాని 1987లో తన స్థలంపై మరో వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ కల్పించారు. రూ.55వేలకు స్థలాన్ని అమ్మి పెట్టాలని కోరారు. కానీ స్థలం అమ్ముడవలేదు. యజమాని మనసు మార్చుకొన్నారు. పవర్ అటార్నీ ఒరిజినల్ డాక్యుమెంట్‌ను వెనక్కు తీసుకొన్నారు. అయితే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి డూప్లికేట్ కాపీ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని తెప్పించుకొన్నారు. యజమానికి తెలియకుండా రూ.30 వేలకు స్థలాన్ని అమ్మేశాడు. దీనిపై యజమాని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు. రిజిస్ట్రేషన్ చెల్లదని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే, దీనిపై పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
హిమాచల్ హైకోర్టు తీర్పు రద్దు
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. పై కేసులో యజమాని చేసినట్టుగా పవర్ ఆఫ్ అటార్నీని మౌఖికంగా రద్దు చేయలేరని స్పష్టం చేసింది. ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చెల్లదు అని చెప్పడానికి రిజిస్ట్రేషన్ చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని, సెక్షన్ 35 ప్రకారం.. స్థలం అమ్మే వ్యక్తి ఇచ్చిన పత్రాల పట్ల అధికారులు సంతృప్తి చెందితే రిజిస్ట్రేషన్ చేయవచ్చని తెలిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ పీఎస్ నరసింహ ఈ తీర్పును ఇచ్చారు.