నిజామాబాద్ క్రైం, మార్చి 10: తెలంగాణ, మహారాష్ట్రలో లారీలు, కార్లను దొంగిలించే ముఠాకు చెందిన ఇద్దరిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడితో పాటు నిజామాబాద్ నగరానికి చెందిన మరో నిందితుడు కలిసి వాహనాలను దొంగిలించి, హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి విక్రయించేవారు. దొంగిలించిన వాహనాలను ఎవరూ గుర్తుపట్టకుండా వాటికి వీరు ప్రత్యేకంగా తయారుచేయించిన బోగస్ నంబర్ల స్టిక్కర్లను అతికించి అమ్మేవారు.
మహారాష్ట్రకు చెందిన పాత నేరస్థుడు గతంలో వాహనాలకు సంబంధించిన 13 చోరీ కేసుల్లో అక్కడి జైలులో శిక్ష అనుభవించాడు. గురువారం నిజామాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కె.ఆర్.నాగరాజు వాహనాల దొంగల వివరాలను వెల్లడించారు. ముంబై ప్రాంతంలోని కుర్ల బీర్ అహ్మద్ నగర్‌కు చెందిన అజ్రత్ అలీ ఖాన్, నిజామాబాద్ నగరంలోని అహ్మద్పుర కాలనీకి చెందిన షేక్ సమద్ ఖాన్ కలిసి ఈ నెల 2వ తేదీన రూరల్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తా నుంచి ఓ లారీని దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుమేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, బైపాస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో గురువారం ఓ లారీ, కారు కనిపించాయి.
పోలీసులకు అనుమానం వచ్చి వాహనాల డాక్యుమెంట్స్ చూపించాలని అడుగగా, వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఇంద్రవెల్లి, నేరేడుగొండ, ముప్కాల్, జగిత్యాల, ఇచ్చోడ, ఉట్నూర్, గుడి హత్నూర్, నిర్మల్ రూరల్ ఏరియాలో చోరీలకు పాల్పడినట్లు తేలిందని సీపీ వివరించారు. కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి లారీ, కారుతోపాటు బోగస్ నంబర్ల స్టిక్కర్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వీరు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన మరో నిందితుడు ఎండీ అబ్దుల్ లతీఫ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన సౌత్ రూరల్ సీఐ జగడం నరే శ్, ఎస్సై లింబాద్రితో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.