మోర్తాడ్, మార్చి 10: ప్రభు త్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అదృష్టలక్ష్మిలా తలుపు తట్టిందని, చాలెంజ్‌గా తీసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి దళితులకు సూచించారు. మోర్తాడ్‌లోని రైతువేదిక భవనంలో గురువారం ఏర్పాటుచేసిన బాల్కొండ నియోజకవర్గ స్థాయి దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షలతో ఎన్ని యూనిట్లనైనా, రాష్ట్రంలో ఎక్కడైనా నెలకొల్పవచ్చని సూచించారు. డిమాండ్ ఉన్న యూనిట్‌ను ఎంచుకొని కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతిఒక్కరూ ఆర్థికాభివృద్ధి సాధించి ఇకముందు ఎంపికయ్యే లబ్ధిదారులకు ఆదర్శంగా నిలువాలని సూచించారు. ఈ పథకం ప్రతి దళిత కుటుంబానికి అందుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. ఎలాంటి సమస్యలు, అనుమానాలు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఇంటింటికీ తిరుగుతూ.. లబ్ధిదారులను కలిస్తూ..
అంతకుముందు కలెక్టర్ నారాయణరెడ్డి దళితబంధు పథకానికి ఎంపికైన మండలంలోని దోన్పాల్ గ్రామాన్ని సందర్శించారు. దళితుల ఇంటికి వెళ్లి నేరుగా మాట్లాడారు. ఏ యూనిట్‌ను ఎంచుకున్నారు..? యూనిట్‌పై అవగాహన ఉన్నదా..? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచులు బోగ ధరణి, పర్స దేవన్న, ఎంపీటీసీ కళావతి, రాజ్‌పాల్, నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.
డ్రోన్ గురించి కలెక్టర్‌కు వివరించిన లబ్ధిదారుడు
పంటలకు ఎరువులు, మందులను పిచికారీ చేయడానికి డ్రోన్‌ను వినియోగిస్తున్నారని, దళితబంధులో డ్రోన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నానని దోన్పాల్ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు భాస్కర్ కలెక్టర్ నారాయణరెడ్డికి వివరించారు. అప్పటికే తనవద్ద ఉన్న డ్రోన్‌ను కలెక్టర్‌కు చూపించి అది పనిచేసే విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు. కేవలం ఎనిమిది నిమిషాల్లో ఎకరం పంటకు మందును పిచికారీ చేయవచ్చని, ప్రస్తుతం ఎకరానికి రూ.500 తీసుకుంటున్నానని వివరించాడు. దీనిపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తంచేశారు.