నిజామాబాద్, మార్చి 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజ్వరిల్లింది. ఉద్యమ నాయకుడిగా కొట్లాడి సాధించిన తెలంగాణకు సీఎంగా కేసీఆర్ సారథ్యం వహించిన తర్వాత మన నిధులు మనకే చెందుతున్నాయి. అవసరాలకు తగ్గట్లుగా నిర్మించుకున్న సాగు నీటి ప్రాజెక్టులతో బీడు భూములకు నీళ్లు చేరుతున్నాయి. ఏడున్నరేండ్ల కాలంలో లక్షకుపైగా నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్… మరోసారి భారీ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధమయ్యా రు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 91,142 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా 80,039 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. నూతన జో నల్ వ్యవస్థ ప్రకారమే చేపట్టబోతున్న నియామకా ల ప్రక్రియతో స్థానికులకు పెద్ద పీట వేయబోతున్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కుతాయి. 5 శాతం నాన్ లోకల్ కోటాలో ఇతరులకు చెందుతాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువతకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వారీగా వేలాది ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం దక్కింది. నూతన జోనల్ వ్యవస్థలో తొలిసారి ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టబోయే నియామకాలు భారీ మొత్తంలో ఉండడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
స్థానికతకు పెద్ద పీట…
అశాస్త్రీయమైన జోనల్ వ్యవస్థతో ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ వాసులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రా ప్రాంత యువతకే ఉద్యోగాలు లభించే విధంగా పాత జోనల్ వ్యవస్థ అమల్లో ఉండేది. తద్వారా స్థానికత అనేది లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ అంశంపై తీవ్రంగా దృష్టి సారించారు. జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు మేధోమథనం చేశారు. వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ఆయా రంగాలకు చెందిన నిపుణులతో చర్చించి జోనల్ వ్యవస్థను రూపొందించారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడడానికి గతం కంటే ఎక్కువ అవకాశాలు లభించేలా ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి జోన్ 5, జోన్ 6 స్థానంలో 2 మల్టీ జోన్లు, 7 కొత్త జోను, 33 జిల్లాల వారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టేలా ఏర్పాటు చేశారు. తద్వారా స్థానికులకు 95శాతం మేర ఉద్యోగాలు పొందేందుకు వీలు ఏర్పడింది. స్థానికేతరులు ఎవరైనా పోటీ పడాలంటే 5శాతం మేర కోటాను నిర్దేశించారు. గతంలో అమలైన విధానంలో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాలను దెబ్బకొట్టే విధంగా జోనల్ విధానాన్ని అమలు చేశారు.
నియామకాలకు క్యాలెండర్…
రాష్ట్రంలో ఏటా ఖాళీలు ఏర్పడిన పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తద్వారా పారదర్శకంగా ఎప్పటికప్పుడు ఉద్యోగాలను భర్తీ చేసే వ్యవస్థకు పురుడు పోయనున్నారు. అన్ని విభాగాలు తమ వద్ద ఏటా ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ల జారీ కోసం నియామక సంస్థలకు సమాచారం అందించి చర్యలు చేపడతాయి. ఉద్యోగార్దులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధిని ప్రభుత్వం ఇవ్వనున్నది. ఇందుకు అనుగుణంగానే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నది. పోలీస్ శాఖ వంటి యూ నిఫాం సర్వీసులు మినహాయించి ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేండ్లకు ప్రభుత్వం పెంచింది. మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం పోటీ పడే అవకాశాన్ని కల్పించింది. ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయో పరిమితి పెరుగనున్నది.
నీళ్లు, నిధులు, నియామకాలు…
తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏండ్ల కల. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ కాలం కొట్లాడి సాధించారు. 14 ఏండ్ల పాటు వీరోచితంగా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేశారు. ప్రాణాలు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు దిగి రాష్ర్టాన్ని సాధించి పెట్టా రు. చేకూరిన స్వరాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా, రెండో సారి వరుసగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజల ఆశీస్సులతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త రాష్ట్రం కనీవిని ఎరుగని అభివృద్ధిని సాధిస్తూనే దేశంలో మిగిలిన రాష్ర్టాల కన్నా మిన్నగా తెలంగాణ దూసుకుపోతున్నది. అన్ని రంగాల్లో మేటిగా నిలుస్తూ భారతదేశానికి గర్వకారణంగా తెలంగాణ గెలిచి నిలిచింది. నీళ్లు, నిధులు ఇప్పటికే సాకారం కాగా… నిరుద్యోగ యువత ఆశ గా ఎదురు చూస్తున్న నియామకాలు సైతం భారీగా చేపట్టడం ద్వారా తెలంగాణ స్వరాష్ట్ర ట్యాగ్ లైన్ సాకారమైందని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా లక్షా 30వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాగా తాజాగా 91వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.