మోర్తాడ్/ నిజామాబాద్ సిటీ, మార్చి9: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక ముందు రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు అనేవి ఉండవని సీఎం ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట వారితో పని ఎక్కువగా చేయించడం, జీతం తక్కువగా ఇవ్వ డం ఇలాంటి వాటితో నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితికి సీఎం తీసుకున్న నిర్ణయంతో పుల్‌స్టాప్ పడింది. సీఎం నిర్ణయంతో జిల్లాలో సుమా రు 345 మందికి లబ్ధి చేకూరనున్నది. ఇందులో విద్యాశాఖలో 292 ఉన్నారు.
జూనియర్ కళాశాలల్లో పనిచేసే 148 మంది, డిగ్రీకళాశాలల్లో పనిచేసే 99 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేసే 45 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించనున్నారు. దశాబ్దాలుగా తమకు న్యాయం చేయాలని ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం అందించిన తీపి కబురుతో వారిలో సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు. కాంట్రాక్టుకు బీజం 2000 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2000 సంవత్సరంలో జీవో నం బర్ 142,143 తీసుకువచ్చి కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. వీరికి రూ.4500 వేతనాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పోరాటం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 2008లో రూ.6500కు పెంచారు. ఆ తరువాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో పెట్టలేకపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరించేందుకు సీఎం కేసీఆర్ జీవో నంబర్ 16ను తీసుకువచ్చా రు. ఈజీవోను సవాల్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 7న తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం తీసుకువచ్చిన జీవో నంబర్ 16 సబబేనని తీర్పునివ్వడం కాంట్రాక్టు ఉద్యోగులకు సంతోషాన్నిచ్చింది. దాని ప్రకారమే సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరిస్తున్నామని ప్రకటించడం, సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏండ్ల కల నిజమైన వేళ..
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జీవో నంబర్ 16ను సవాల్ చేసిన వారికి కోర్టు కూడా సరైన సమాధానమిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎన్నో ఏండ్ల కల నిజమైన ఈ వేళ మా సంతోషానికి అవధులు లేవు. కాంట్రాక్టు ఉద్యోగుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– లక్ష్మీనర్సయ్య, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎంతో ఆనందంగా ఉంది..
బోధన్, మార్చి 9: 12ఏండ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పిట్లం మండలంలోని కల్హేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న. సీఎం కేసీఆర్ బుధవారం చేసిన ప్రకటన మాకు ఎంతగానో ఆనం దం కలిగించింది. కేసీఆర్ చేసిన ప్రకటన తీపివార్తగా మారింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
– జెల్ల ఉమాపతి, కాంట్రాక్టు అధ్యాపకుడు, బోధన్
ఇచ్చిన హామీ నెలబెట్టుకున్న సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా ఉంది..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న. సీఎం కేసీఆర్ ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
-సరస్వతి, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిజామాబాద్
20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం..
గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యను బోధిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నందున మా జీవితాల్లో ఎలాంటి మార్పులేదు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరం ఎదురుచూస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రకటనతో మా జీవితాల్లో సంతోషం నింపారు.
-కర్నె శ్రీనివాస్, కాంట్రాక్ట్టు లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
మమ్మల్ని అదుకున్న ఏకైక సీఎం కేసీఆర్
కాంట్రాక్ట్ లెక్చరర్‌గా 2004 నుంచి పనిచేస్తున్నా. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీతాలు పెరిగాయి. అసెంబ్లీలో రెగ్యులర్ చేస్తామని ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్.
-వరుణ్‌కుమార్ కాంట్రాక్టు ఉద్యోగి, నిజామాబాద్
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
20 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న మమ్ములను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం తరఫున ధన్యవాదాలు. జీవితకాలం రుణపడి ఉంటాం.
-లక్ష్మీనారాయణ, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
సీఎం నిర్ణయం.. అభినందనీయం
కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. కొందరు రాజకీయ నాయకులు జీవోను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినా కేసును గెలిపించి కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేసిన సీఎం సార్‌కు రుణపడి ఉంటాం. చాలీచాలని జీతాలు, ఉద్యోగభద్రత లేదు, ఇటువంటి పరిస్థితుల్లో సీఎం సార్ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది.
-పరశురాములు, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మోర్తాడ్
మా బతుకులు మారుతాయి..
15 సంవత్సరాలుగా కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. మా ఉద్యోగానికి ఎప్పుడు ఏమవుతుందోనని, ఉన్న ఉద్యోగానికి వేతనం ఇంతే అన్న ఆందోళనతో ఉండే వాళ్లం. కానీ సీఎం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరిస్తున్నామని ప్రకటించడం మాకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సార్‌కు మేము, మా కుటుంబాలు రుణపడి ఉంటాయి.
-రవీందర్‌గౌడ్, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వజూనియర్ కళాశాల మోర్తాడ్
కేసీఆర్‌కు కృతజ్ఞతలు…
ఎన్నో ఏండ్ల నుంచి మా శ్రమ దోపిడీకి గురవుతున్నది. మాకు విముక్తి కల్గించి రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మమ్ములను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టింది.
-నర్సింహులు, కాంట్రాక్టు అధ్యాపక సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
చాలీచాలని వేతనాలతో…
2004లో కాంట్రాక్టు లెక్చరర్‌గా విధుల్లో చేరిన. అప్పటి నుంచి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో ఉండేవారిమి అటువంటిది సీఎం తీసుకున్న నిర్ణయంతో మా ఉద్యోగాలకు భద్రత కలిగినట్లయ్యింది. మాకుటుంబాలకు ఈరోజే దీపావళి వచ్చినంత సంతోషంగా ఉంది.
-వరుణ్, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వజూనియర్ కళాశాల, మోర్తాడ్