బీర్కూర్, మార్చి 8 : రాష్ట్రంలోని దళితులందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాలులో నియోజకవర్గంలో మొదటి విడుత దళిత బంధు లబ్ధిదారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి రెండు వేల మందికి ఈ పథకాన్ని అందజేయడానికి బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించనున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ. లక్ష రుణం ఇస్తే అందులో 20 శాతం సబ్సిడీ ఉండేదని, 80 వేల రుణం కోసం బ్యాం కుల చుట్టూ 80 సార్లు తిరగాల్సి వచ్చేదని అన్నారు.
బ్యాంకులకు సంబంధం లేకుండా దళిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దళితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశానికి కోటగిరి మండలం నుంచి లబ్ధిదారులు తక్కువ మంది రావడంతో ఎంపీడీవోపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.