గాంధారి, నవంబర్ 2 : నాటు సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గాంధారి మండలంలోని గండివేట్ తండాపై మంగళవారం దాడులు చేశారు. గాంధారి మండలంలోని గండివేట్ తండాలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తండా శివారులోని వాగు పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా బట్టీలను ఏర్పాటు చేసి, నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారంతోఅందడంతో దాడులు చేసినట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఎన్.రాణి తెలిపారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న నాలుగు బట్టీల ను ధ్వంసం చేయడంతో పాటు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 450 లీటర్ల బెల్లం పాకాన్ని, ఇప్ప పువ్వును పారబోసినట్లు తెలిపారు. త్వరలోనే నాటు సారాను తయారు చేసి, విక్రయిస్తున్న నిందితులను పట్టుకుంటామని తెలిపారు. నిషేధిత గంజాయిని సాగు చేయడం, నాటు సారా తయారు చేసినా.. విక్రయించినా సమాచారం ఇవ్వాలని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై రమేశ్ ,ఎస్సై రాధికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ ఎదుట ఆరుగురు బైండోవర్..
గతంలో నాటు సారా తయారు చేసి విక్రయించడంతో పాటు, గంజాయిని సాగు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని గండివేట్ తండాకు చెందిన జాట్రోత్ పీరు, నేనావత్ దోళీ, కేతావత్ సురేందర్, జాట్రోత్ శ్రీరాం, జాట్రోత్ రవి, బదావత్ సక్కున అనే ఏడుగురిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ గతం లో నాటు సారా తయారీతో పాటు, గంజాయి సాగు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు భవిష్యత్తులో తిరిగి తప్పు చేయకుండా ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎైక్సైజ్ ఎస్సైలు రమేశ్, రాధిక కానిస్టేబుళ్లు ఉన్నారు.
ధర్పల్లిలో ఒకరు..
ధర్పల్లి, నవంబర్ 2 : మండలంలోని మరియాతండాకు చెందిన బాదావత్ జమున అనే మహిళను తహసీల్దార్ జయంత్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు భీమ్‌గల్ ఎక్సైజ్ ఎస్సై శంకర్ తెలిపారు. నాటుసారా కాస్తుందన్న సమాచారంతో దాడులు నిర్వహించి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి మరోసారి ఇలాంటి పనులు చేపట్టకుండా హెచ్చరించి బైండోవర్ చేసినట్లు చెప్పారు. నాటుసారా తయారు చేసినా.. గంజాయి సాగు చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.