న్యూయార్క్: అమెరికా అరెస్ట్ చేసిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో (63)ను ఆదివారం న్యూయార్క్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆయన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఉగ్రవాదానికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది. మదురో ప్రభుత్వం మాదక ద్రవ్యాల తయారీలో నిమగ్నమైందని, కార్టెల్స్‌కు ఆశ్రయం ఇస్తున్నదని, అమెరికన్లను నాశనం చేయడం కోసం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా పంపిస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలపై ఆయనను విచారిస్తారు.
మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్, ఆయన కుమారుడు, మరో ముగ్గురిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మదురో నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతి కుట్రలకు పాల్పడ్డారని, విధ్వంసకర పరికరాలతోపాటు మెషీన్ గన్స్‌ను కలిగియున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. మదురోను సోమవారం మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
సురక్షితంగా, న్యాయంగా అధికార మార్పిడి జరిగే వరకు వెనెజువెలాను తాత్కాలికంగా అమెరికా నడుపుతుందని, అక్కడ విస్తృతస్థాయిలో ఉన్న చమురు నిక్షేపాలను తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అక్కడి చమురును ఇతర దేశాలకు విక్రయిస్తామని కూడా తెలిపారు. అమెరికా సార్వభౌమత్వాన్ని బెదిరించే వారికి, అమెరికన్ల జీవితాలకు ప్రమాదం కలిగించే వారికి ఈ విజయవంతమైన ఆపరేషన్ ఓ హెచ్చరిక అని చెప్పారు. మదురో నివాసానికి నకలును అమెరికన్ దళాలు నిర్మించాయని ట్రంప్ చెప్పారు.
ఈ ఆపరేషన్ ైక్లెమాక్స్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూశానన్నారు. “నేను చూశాను, అక్షరాలా, టెలివిజన్ షో చూసినట్లు చూశాను” అని చెప్పారు. వెనెజువెలా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటలకు అమెరికా డెల్టా ఫోర్స్ దాడి చేసింది. రాజధాని నగరం కారకాస్‌లోని ఫోర్ట్ టియూనా మిలిటరీ కాంప్లెక్స్‌లోని మదురో నివాసంలోకి దూసుకెళ్లింది. పవర్ గ్రిడ్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 40 మంది మరణించారు.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. పరిపాలన కొనసాగడానికి, దేశ సమగ్ర రక్షణ కోసం ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది. ఇది అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోదగిన అత్యంత తీవ్ర పరిణామమని పేర్కొంది.తమ దేశ వ్యూహాత్మక వనరులను, ముఖ్యంగా చమురు, ఖనిజాలను కబ్జా చేయడం కోసమే ఈ దాడికి అమెరికా తెగబడిందని తెలిపింది. తమ దేశ రాజకీయ స్వతంత్రతను బలవంతంగా దెబ్బతీసిందని ఆవేదన చెందింది.
వెనెజువెలాలో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళనకరమని భారత్ పేర్కొంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వెనెజువెలా ప్రజల భద్రత, సంక్షేమాలకు మద్దతును పునరుద్ఘాటించింది. సంబంధిత భాగస్వామ్య పక్షాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది.
మదురో, ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకుపోవడం పట్ల చైనా ఆదివారం తీవ్రంగా స్పందించింది. మదురో, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బలవంతంగా ఒక దేశ అధ్యక్షుడు, ఆయన భార్యను తమ దేశానికి బంధించి తీసుకుపోవడం అంతర్జాతీయ చట్టాన్ని, అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడేందుకు ఉద్దేశించిన యూఎన్ చార్టర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.