హక్కుల హననంలో మరో కొత్త అధ్యాయానికి కేంద్రంలోని మోదీ సర్కార్ తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం (ఢిల్లీ) నుంచి రిపోర్ట్ చేసే జర్నలిస్టులకు ఇచ్చే అధికారిక గుర్తింపు (అక్రెడిటేషన్) విషయంలో ఇటీవల జారీచేసిన నూతన నిబంధనలు.. పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కే విధంగా ఉన్నాయి. పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి విలేకరులు పనిచేసే విధంగా ఈ నిబంధనలు ఉండటం శోచనీయం. వీటిని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్రంగా ఖండించింది. కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
‘సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్లైన్స్, 2022’ పేరుతో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక జర్నలిస్టుకు ఉన్న అక్రెడిటేషన్ను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయవచ్చు. ‘తీవ్రమైన నేరారోపణకు గురైన లేదా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఆరోపణలున్నా లేదా హుందాగా, నైతికంగా వ్యవహరించటం లేదని ఆరోపణలున్నా లేదా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఆరోపణలున్నా లేదా ఎవరినైనా ఏదైనా నేరం చేయటానికి పురిగొల్పినట్లు ఆరోపణలున్నా అక్రెడిటేషన్ను రద్దు చేయవచ్చు. ప్రజా క్షేత్రంలో పనిచేసే జర్నలిస్టులపై ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నది. అవి నిరూపితమైతే చర్యలు తీసుకోవాలి గానీ, ఆరోపణ రాగానే గుర్తింపు రద్దు చేయటమేంటి? తన విధానాలను ప్రశ్నించే, ప్రజల ముందు విశ్లేషించే జర్నలిస్టుల నోరు మూయించటానికి ఇదొక కుతంత్రమా? అటువంటి పాత్రికేయులపై ప్రభుత్వమే కేసులు నమోదు చేసి వాటి ఆధారంగా గుర్తింపు రద్దుచేయటం కోసమా ఈ నిబంధనలు?
అక్రెడిటేషన్ రద్దు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన కారణాల్లో.. పరువు నష్టం కూడా ఒకటి. అంటే, ఒక జర్నలిస్టు ఏదైనా ఓ అక్రమాన్నో, అవినీతినో బట్టబయలు చేస్తే.. సంబంధిత వ్యక్తులు ప్రతీకారంగా పరువునష్టం కేసు దాఖలు చేస్తే, దాని ఆధారంగా అక్రెడిటేషన్ను తొలగించవచ్చు. ఇంకా విచిత్రమైన విషయమేమంటే.. గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకునేది ఎవరన్నదానిపై నిబంధనల్లో ప్రస్తావన లేదు. అంతేకాదు, తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకొనే అవకాశం కూడా జర్నలిస్టులకు ఇవ్వలేదు.
ఇక ఈ నిబంధనల్లో ఉన్న అత్యంత అప్రజాస్వామిక అంశం.. పోలీసుల ధ్రువీకరణ. జర్నలిస్టుకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే పోలీసులు ఆ జర్నలిస్టు చరిత్రను పరిశీలించి, ధ్రువీకరించాలి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థుల విషయంలో ఈ నిబంధన ఉంటుంది. కానీ, జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగులు కారే? అలాంటప్పుడు ఈ నిబంధన ఎలా తీసుకొస్తారు? ఏండ్లుగా ఉన్న అక్రెడిటేషన్ నిబంధనల్లో ఇది లేదు. దీన్ని మోదీ సర్కార్ కొత్తగా చేర్చింది. దీని ద్వారా జర్నలిస్టుల మీద పోలీసుల పెత్తనాన్ని పెట్టే చర్యకు దిగింది. పోలీసులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తారు కాబట్టి, వారి ద్వారా జర్నలిస్టులను నియంత్రించాలని మోదీ సర్కార్ ఈ నిబంధనను కొత్తగా సృష్టించినట్లుంది.
ఈ నిబంధనల రూపకల్పన సమయంలోగానీ, వీటిని జారీచేసే సమయంలోగానీ కేంద్రం పాత్రికేయ సంఘాలతో గానీ, మీడియా సంస్థలతో గానీ ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. వాటి అభిప్రాయాలు తీసుకోలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి రోజురోజుకూ అధోముఖంగా పయనిస్తున్నదని అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా.. ఏకపక్ష ధోరణిలో ముం దుకువెళ్తున్నది. దీంట్లోభాగమే జర్నలిస్టుల గుర్తింపు నిబంధనలు. కేంద్రం విధానాలను సహేతుకంగా, ప్రజా దృక్కోణంలో విశ్లేషించే పాత్రికేయుల చేతులు కట్టేయాలన్నదే ఈ కొత్త నిబంధనల లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ మేరకు ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తన నిరసనను తెలుపుతూ కేంద్ర ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’కు ఒక లేఖ రాసింది. ఈ నిబంధనలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది.
– కె.వి.రవికుమార్