e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News టెలికంలో నూతన సంస్కరణలు

టెలికంలో నూతన సంస్కరణలు

  • పరిశ్రమ సూచనల్ని ఆహ్వానించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8: దేశీయ టెలికం రంగాన్ని, రెగ్యులేటరీ వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి నూతన సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. బుధవారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)లో మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సమానవృద్ధి కోసం డిజిటల్‌ కనెక్టివిటీని పెంచడానికి ఏమి చేయాలన్న అంశమై పరిశ్రమ నేతల అభిప్రాయాల్ని కోరారు. టెలికం రంగంలో పెట్టుబడుల్ని పోత్సహించడానికి, ఆయా కంపెనీల నగదు రాబడుల్ని పెంచేక్రమంలో రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థల్ని నిలబెట్టడానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం పలు సంస్కరణల్ని ప్రకటించింది.

సమాజంలో అట్టడుగుస్థాయివరకూ డిజిటల్‌ కనెక్టివిటీని అందించడం, విశ్వసనీయమైన పరికరాలతో టెలికం నెట్‌వర్క్‌ను సురక్షితం చేయడం వంటి అంశాల్లో కొత్త సంస్కరణల కోసం సూచనలివ్వాలని వైష్ణవ్‌ అన్నారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా అభివృద్ధిచేసిన 4జీ నెట్‌వెర్క్‌ను త్వరలో అమర్చనున్నదని కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి దేవుసింహ చౌహాన్‌ చెప్పారు. దేశీయంగా డిజైన్‌ చేసి, అభివృద్ధిపరుస్తున్న 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను వచ్చే ఏడాది త్రైమాసికంలో ప్రవేశపెట్టనున్నామన్నారు. 6జీ టెక్నాలజీలను సైతం అభివృద్ధిచేయడానికి టెలికం శాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -

స్పెక్ట్రమ్‌ ధరలు తగ్గించాలి
సునీల్‌ మిట్టల్‌

కనిష్ఠ సుంకాలు, స్పెక్ట్రం ధరల తగ్గింపు టెలికం పరిశ్రమ సమగ్రవృద్ధికి దోహదపడుతుందని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. టెలికం రంగంపై తాజా లిటిగేషన్లు పడకుండా రెగ్యులేటర్‌ చూడాలని, ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. పోటీ కంపెనీల మధ్య పరస్పర సహకారం ఉండాలని మిట్టల్‌ చెపుతూ 5జీ, 6జీలు రాబోతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కలిసిరావాలని సహకంపెనీలను కోరారు. టవర్లు, ఫైబర్‌కు సంబంధించి పరిశ్రమలో ఎంతో డూప్లికేషన్‌ ఉందని, పరస్పరం చర్చించుకొని, ప్రపంచంలోని మిగతా దేశాల్లానే కలిసి మౌలిక వసతుల్ని కల్పించుకోవాలన్నారు.

స్మార్ట్‌ఫోన్లకు సబ్సిడీలివ్వాలి
ముకేశ్‌ అంబానీ

డిజిటల్‌ విప్లవం దేశవ్యా ప్తం చేసేక్రమంలో ఎంపికచేసిన గ్రూప్‌లు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు..యూఎస్‌వో ఫండ్‌ నుంచి ప్రభుత్వం సబ్సిడీ అందించాలని రిలయన్స్‌ జియో అధినేత ముకేశ్‌ అంబానీ ఐఎంసీ సదస్సులో విజ్ఞప్తి చేసారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కోట్లాదిమంది ప్రజలు 2జీ ఫోన్లకే పరిమితంకావడంతో డిజిటల్‌ విప్లవం ప్రయోజనాలు అందడం లేదన్నారు. 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలంటే స్మార్ట్‌ఫోన్లు కావాలని, దేశంలో 28 కోట్ల మంది ఇంకా బేసిక్‌ ఫీచర్‌ఫోన్లనే వాడుతున్నారని అంబానీ వివరించారు. 5జీ సర్వీసుల అమలు జాతీయ ప్రాధాన్యత కావాలని, అన్‌లిమిటెడ్‌ డాటా సామర్థ్యం కలిగిన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నారు. కంపెనీలన్నీ కలిసి పనిచేస్తే అన్ని ప్రాంతాలకు ఫైబర్‌ వేయగలమని చెప్పారు.

బ్యాంకింగ్‌ మద్దతు కావాలి
కుమార్‌ మంగళం బిర్లా

ప్రభుత్వం సరళ వాణిజ్య విధానాలు, బ్యాంకింగ్‌ రంగం మద్దతుతో టెలికం పరిశ్రమ పటిష్టపడుతుందని వొడాఫోన్‌ఐడియాలో భాగస్వామ్యం కలిగిన ఆదిత్యా బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా చెప్పారు. డిజిటల్‌ విజన్‌ను సాధించేందుకు టెలికంలో పెట్టుబడులు అవసరమన్నారు. 2025 కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మొబైల్‌ పరిశ్రమ పాత్ర కీలకంగా ఉండనున్నదన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement