హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల నుంచి డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్సార్) యాప్ ఫొటోలను పంపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించింది. మొత్తం 131 మండలాల్లోని 878 గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యలున్నట్లు గుర్తించింది. గ్రామ కార్యదర్శులు ప్రతిరోజూ ఈ యాప్ ద్వారా గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులకు సంబంధించిన ఎనిమిది ఫొటోలను పంపించాల్సి ఉంటుంది.
యాప్ ద్వారానే వారి హాజరు నమోదవుతున్నది. అయితే, మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఫొటోలను అప్లోడ్ చేయడం సమస్యాత్మకంగా మారుతున్నది. సకాలంలో అప్లోడ్ చేయకపోతే గైర్హాజర్ నమోదువుతున్నది. దీంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని ఎత్తైన ప్రదేశాలు, సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలను వెదుక్కొని ఫొటోలను అప్లోడ్ చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో నెట్వర్క్ సమస్యలున్న గ్రామాలను గుర్తించి, ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకొంటున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.